నిర్మల్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): మాట ఇస్తే మడమ తిప్పని తెలంగాణ ప్రభుత్వం.. జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ముఖ్యంగా మారుమూల మండలంగా పేరున్న మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ దాదాపు 10 గ్రామాల ప్రజలు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. పొన్కల్‌ను కేంద్రంగా చేసుకొని కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గత కొంతకాలంగా కొనసాగుతోంది. మామడ మండలంలో 27 గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాలు కలిపి మొత్తం 40 గ్రామాలు ఉన్నాయి. సుదీర్ఘమైన విస్తీర్ణం, అనేక తండాలు, గూడేలు ఈ మండలంలో ఉండడంతో పాటు మండల కేంద్రమైన మామడ పలు గ్రామాలకు దూరంగా ఉన్న కారణంగా తరచూ పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మేజర్ పంచాయతీగా ఉన్న పొన్కల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి, చుట్టూ ఉన్న 10 గ్రామాలతో కలిపి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయమై స్థానిక నాయకులు హరీశ్‌కుమార్, ఏనుగులింగారెడ్డి, నవీన్‌రావు తదితరుల ఆధ్వర్యంలో స్థానికులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. అయితే వీరందరి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న మంత్రి కొద్ది రోజుల క్రితం కొత్త మండల ఏర్పాటు ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌కు వివరించారు. అలాగే మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి స్థానికుల డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్న నేపథ్యంలో పొన్కల్ మండల ఏర్పాటు విషయంలో సర్కారుపై ఒత్తిడి పెంచారు. ఇప్పటికే మామడ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయల నిధులను మంత్రి మంజూరు చేయిస్తున్నారు.
మారుమూల గ్రామాలకు రోడ్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త మండలం ఏర్పాటైతే దాదాపు 10 గ్రామాల ప్రజలకు పరిపాలనతో పాటు, ఇతర సౌకర్యాలు అదనంగా చేకూరనున్నాయని మంత్రి భావించారు. అలాగే ప్రస్తుతమున్న మామడ మండలంపై భారం కూడా తగ్గుతుందని సీఎం కేసీఆర్ వద్ద మంత్రి అల్లోల ఇటీవలే మరోసారి ప్రస్థావించారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభ్యర్థనను సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకొని కొత్త మండలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు శుక్ర వారం రాష్ట్ర ప్రభుత్వం పొన్కల్‌ను మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై స్థానికులు 15 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని 15 రోజుల తర్వాత కొత్త మండలం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నది. కొత్త మండల ఏర్పాటు ప్రకటన రావడంతో పొన్కల్ వాసులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సైతం పొన్కల్ మండల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
10 గ్రామాలతో కొత్త మండలం..
ప్రభుత్వ ప్రకటనతో కొత్త మండలంగా ఏర్పాటు కానున్న పొన్కల్ మండల పరిధిలో 7 గ్రామ పంచాయతీలతో పాటు మరో మూడు అనుబంధ గ్రామాలు ఉండనున్నాయి. పొన్కల్, కమల్‌కోట్, నల్ధుర్తి, దేవతాపూర్, వెంకటాపూర్, బండల ఖానాపూర్, పోతారం, అనంతపేట్, కొత్త టెంబరేణి, ఆదర్శనగర్ కొత్తూర్ తదితర గ్రామాలతో నూతన మండలం ఏర్పాటు కానున్నది.