నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(గురువారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని కొత్త కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి మద్దతుగా ప్రచార సభలో ప్రసంగించనున్నారు.
ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తొలి సభ కావడంతో మంత్రి అల్లోల ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణ చేస్తున్నారు. అన్నీతానై పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు. కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం గులాబీ మయమైంది. స్వాగత తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు.
– మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్త కలెక్టరేట్‌కు వెళ్లే దారిలోని క్రశ్చర్ ఏరియాలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు జరిగే సభలో గులాబీ బాస్ పాల్గొంటారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా సీఎం కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు.
ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. భారీ వేదికతోపాటు వచ్చే జనం, కార్యకర్తలు, నాయకులు కూర్చోడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభ చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ గులాబీమయమయ్యాయి. సీఎం కేసీఆర్‌కు స్వాగతం చెప్తూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొన్ని రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సభాస్థలిని మరోసారి పరిశీలించిన మంత్రి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభ నిర్మల్ జిల్లాతోనే మొదలుకానుంది. రేపు(శుక్రవారం) ముథోల్ నియోజకవర్గం భైంసాలో రెండో సభ జరగనుంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు మామడ, సోన్, నిర్మల్ రూరల్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(జీ) మండలాల నుంచి వేలాది మంది సభకు రానున్నారు. ఈ మేరకు అవసరమైన వాహనాలను ఇప్పటికే సమకూరుస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి వాహనాలు ఉండేలా ప్రత్యేకంగా మానిటింగ్ చేస్తున్నారు. సభ మధ్యాహ్నం ఉన్న నేపథ్యంలో వచ్చే వారికి ఎండ తగలకుండా భారీ టెంట్లు వేశారు.
వచ్చిన ప్రతి ఒక్కరూ కూర్చునేలా కుర్చీలు వేయించడంతోపాటు తాగునీటి సదుపాయాలు కల్పించారు. ప్రాంగణం మధ్య మధ్యలో సౌండ్ బాక్సులు ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందిని సభకు తరలించాలనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సెక్యూరిటీ పరంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సభకు ఖానాపూర్, మంచిర్యాల రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిర్మల్ అవతల బైపాస్‌రోడ్డు వరకు అనుమతిస్తారు.
ఇతర వాహనాలను అక్కడి నుంచే మళ్లిస్తారు. నిర్మల్ పట్టణం నుంచి వచ్చే వాహనాలను మంచిర్యాల చౌరస్తా నుంచి డైవర్ట్ చేస్తారు. సారంగాపూర్ నుంచి వచ్చే వాహనాలు మంగల్‌పేట్ మీదుగా కలెక్టర్ రోడ్డు నుంచి సభా ప్రాంగణం దగ్గరికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం హెలికాప్టర్లో బయల్దేరి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నిర్మల్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో బయల్దేరి బాల్కొండలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తారు.