“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్‌గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్గాల సంక్షేమానికి 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ సర్కారు కావాల్నా.. కరెంటును కాటగల్పుతా మంటున్న కాంగ్రెస్ కావాల్నా..’ ప్రజలారా ఆలోచించాలి.. అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. గురువారం ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో మతవిద్వేషాలు, గొడవలు, కర్ఫ్యూలు లేవని.. బీజేపీ నాయకులు ఓట్ల కోసం చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ప్రగతి రామన్నతోనే సాధ్యమైందని, మంచి వ్యక్తని, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే నాయకుడని కొనియాడారు. ఆదిలాబా ద్, బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
– ఆదిలాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : ‘కరెంటు విషయంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నరు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు సరిపోతుందంటున్నడు. టెన్ హెచ్‌పీ మోటర్ పెట్టాలంటున్నడు.’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాల మైదానం, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలంలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో సీఎం ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి జోగు రామన్నతోనే సాధ్యమైందన్నారు. జోగు రామన్న ఉత్తమమైన వ్యక్తి అని ప్రజల్లో మమేకమవుతూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే నాయకుడన్నారు.
గత పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని 50 ఏండ్లుగా పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణం పేరిట ఓట్లు దండుకున్నారన్నారని మండిపడ్డారు. రామన్న పెన్‌గంగ ప్రాజెక్టు విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా వ్యవహరించి తనను ప్రాజెక్టుకు వద్దకు తీసుకుపోయారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్టు, పంప్‌హౌస్, కాలువల పనులు పూర్తయ్యాయని డిస్ట్రీబ్యూటరీలను త్వరలో నిర్మించి, 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. చనాక-కొరాట ప్రాజెక్టు లింక్ ద్వారా పిప్పల్‌కోటి ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఎకరాల ఆయకట్టు ఉన్న సాత్నాల ప్రాజెక్టు కేవలం 8 వేల ఎకరాలు పారేదని, గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోక పోవడం వల్ల సాగునీరు అందలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు ఆధునికీకరణ, లక్ష్మీపూర్ రిజర్వాయర్‌ను నిర్మించనట్లు తెలిపారు. ప్రస్తుతం సాత్నాల ద్వారా 20 వేల ఎకరాలకు నీటి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ప్రజలు చదువుల కో సం ఇబ్బందులు పడేవారని, పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్‌లో విద్యాసంస్థలను ప్రారంభించామన్నారు. వ్యవసా య, జేఎన్టీయూ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశా లు, ఇతర విద్యాసంస్థలను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం లో 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసింద ని, తాను కేంద్రానికి వంద లేఖలు రాసినా ఒక్క కళాశాల తెలంగాణకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలు ఏ ర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నా, కేంద్రం రా ష్ర్టానికి స్కూళ్ల విషయంలో అన్యాయం చేస్తున్నదని స్పష్టం చేశారు. ఎన్నికల విషయంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో చైతన్యం బాగా ఉందని ప్రజాస్వామ్యంలో విలువైన ఆయుధం అనే ఓటును ఆలోచించి వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థులతోపాటు పార్టీల విషయంలో ఆలోచించాలని కోరారు. ప్రజా వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.
కరెంటు విషయంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు సరిపోతుందని టెన్ హెచ్‌పీ మోటర్ పెట్టాలంటున్నారని గుర్తు చేశారు. రైతులు త్రి, ఫై హెచ్‌పీ మోటర్లు వాడుతారని, టెన్ హెచ్‌పీ మోటర్లు వాళ్ల అయ్య తెస్తాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తం కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్ అని అంటున్నారని, ఆ పార్టీ ఢిల్లీ నాయకులు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణీని బంగాళాఖాతంలో పడేస్తామని అంటున్నారు. సీఎం ప్రశ్నలకు రైతులు తమకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా కావాలని, ధరణీ ఉండాలని చేతులెత్తి కేరింతలు కొట్టారు. కరెంటు కావాల్నా… కాంగ్రెస్ కావాల్నా.. రైతుబంధు కావాల్నా… రా బందు కావాల్నా ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. గిరిజనులు ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. గిరిజనేతరుల పట్టాల కోసం కేంద్రం తో పోరాటం చేసి ఇప్పిస్తామన్నారు. కేంద్ర ప్రభు త్వం రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నా రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు ఉండి గడ్డి కోస్తున్నారని ఘాటు గా విమర్శించారు. వీరికి ఒక్క ఓటు కూడా వేయవద్దని కోరారు. బోథ్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జనరల్ డిగ్రీ కళాశాల వంద శాతం ఇస్తామన్నారు. ఇక్కడి ప్రాంత రైతులు కూరగాయల సాగు చేస్తుంటారని, మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. కుప్టి రిజర్వాయర్ కట్టాలని నిర్ణయించామని, అధికారంలోకి రాగానే మొదలు పెట్టి పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.
బోథ్ ప్రాంతంలోని రైతులు ఒకప్పుడు కరెంట్ లేక, భూగర్భ జలాలు లేక పంటలు వేసి నష్టపోయారని, మిషన్ కాకతీయ పథకంలో 70-80 చెరువుల్లో పూడికతీత పనులు చేయించామన్నారు. వాటికి పూర్వవైభవంతోపాటు పది వరకు కొత్త చెరువులు కట్టడంతో నీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో అన్నదాతలు రెండు పంటలు పండించుకుంటున్నారన్నారు. పిప్పల్‌కోటి ప్రాజెక్టుకు పెన్‌గంగ నీటి తెప్పించి సాగు నీటిని అందిస్తామన్నారు. 58 ఏళ్లు అరిగోస పెట్టిన కాంగ్రెస్ పాలనలో కలుషిత తాగు నీటితో రోగాల బారిన పడిన జనంతో మంచం పట్టిన మన్యం వార్తలు అనే పతాక శీర్షికలతో పత్రికల్లో వార్తలు వచ్చేవన్నారు. మిషన్ భగీరథ పథకంతో శుద్ధజలం అందించడం వల్ల రోగాలు తగ్గాయన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనను, గత ప్రభుత్వాల పాలన తీరును గ్రామాల్లో చర్చకు పెట్టాలన్నారు.
అమలు చేస్తున్న పథకాల గురించి కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలన్నారు. అభ్యర్థి, వారు పోటీ చేస్తున్న పార్టీ, పనితీరును చూసి ప్రజలు తీర్పు చెప్పాలన్నారు. ఆగమాగమై ఓటు వేస్తే ఐదేళ్ల పాటు ఆగం కావల్సి వస్తుందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడు గంటల కరెంట్ సరిపోతుందని, మరో నాయకుడు రైతుబంధు అవసరం లేదంటున్నాడు. రాహుల్‌గాంధీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తానంటున్నాడు.’ ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో మతవిద్వేషాలు, గొడవలు, కర్ఫ్యూల వంటి వాటికి తావులేకుండా పోయిందన్నారు.
బీజేపీ నాయకులు ఓట్ల కోసం చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని ముక్రా(కే) గ్రామ సర్పంచ్ మీనాక్షి గ్రామా న్ని ఆదర్శంగా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గు ర్తింపు తెచ్చుకున్నారన్నారు. వేర్వేరుగా జరిగిన స మావేశాల్లో మాజీ స్పీకర్ మధుసూదనచారి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయుకులు యూనిస్ అక్బానీ, సాజిదొద్దిన్, గోవర్ధన్, రౌతు మనోహర్ పాల్గొన్నారు.