2023 అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో జాబితాను విడుదల చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ స్థానాల్లో అభ్యర్థులను మార్చుతున్నాం.
– బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్‌లకే పట్టం కట్టారు. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. ఏడుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో మార్పు చేశారు. టికెట్లు ఖరారు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతుండగా.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పదికి పది భారీ మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అపురూప కానుక ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా.. నిత్యం ప్రజల్లో ఉంటూ, సేవ చేసిన నాయకులకే అవకాశం కల్పించడంపై పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నాయి.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ తొలి అడుగు వేసింది. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్.. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. 119 స్థానాల్లో ఏడు స్థానాలు మినహా మిగిలిన టికెట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించారు. మిగిలిన పార్టీల్లో నాయకులు టికెట్ల కోసం కొట్టుకుంటుంటే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రావడం కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపింది. ప్రత్యర్థి ఎవరో తేలకముందే ఆత్మవిశ్వాసంతో అభ్యర్థులను ప్రకటించడంపై హర్షం వ్యక్తం అవుతుతోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ.. పార్టీ కోసం కష్టపడుతూ, నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజా సేవకు అంకితమైన వారికే టికెట్టు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇందులో ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ జోగు రామన్న, ముథోల్ విఠల్‌రెడ్డి, మంచిర్యాల దివాకర్‌రావు, చెన్నూర్ బాల్క సుమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, సిర్పూర్ కోనేరు కోన్నప్పలకు తిరిగి టికెట్లు కేటాయించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం కష్టపడుతూ, నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరున్న నాయకులు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి ఆసిఫాబాద్, అనిల్ జాదవ్‌కు బోథ్, జాన్సన్ నాయక్‌కు ఖానాపూర్ టికెట్లు ఇచ్చారు. జనం మనసులో ఉన్న నాయకులకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారంటూ ప్రజలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అపురూపమైన కానుక ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సంబురాల్లో పాల్గొన్నారు. తమ కష్టాన్ని గుర్తిం చి టికెట్ ఇచ్చిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తామంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో పార్టీ యువ నాయకుడు విజిత్‌రావు, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
చెన్నూర్ శాసన సభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన. ఎన్నో కేసుల పాలైన. లాఠీ దెబ్బలు భరించిన. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్ని కల్లో సీఎం కేసీఆర్ చెన్నూర్ నుంచి అవకాశం కల్పించారు. ఇక్కడి ప్రజలు ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనక్కి నెట్టివేయబడ్డ చెన్నూర్ నియోజకవ ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే భారీ మెజార్టీతో గెలిపించాలి.
– బాల్క సుమన్, చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాకు సిర్పూర్ నుంచి వరుసగా రెండోసారి పోటీలో ఉండే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలంగాణను ప్రగతి పథంలో పయనింపజేయాలని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. సిర్పూర్ నుంచి ఘనమైన విజయాన్ని అందిస్తా.
– కోనేరు కోనప్ప, సిర్పూర్(టీ) ఎమ్మెల్యే అభ్యర్థి.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలు గుండెల్లో పెట్టుకు న్నారు. మంచిర్యాల ప్రశాంతంగా ఉండా లంటే అది నాతోనే సాధ్యమనేది ప్రజలు విశ్వసిస్తు న్నారు. గతంలో ఎవ్వరూ చేయని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో చేసి చూపించాం. ఎక్కడికి వెళ్లి చూసినా పదుల సంఖ్యలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మళ్లీ నేనే ఎమ్మెల్యే కావా లని ప్రజలంతా కోరుకుంటున్నారు. రైతులు, దళితులు, బీసీలు సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటా. నా కష్టాన్ని చూస్తున్న ప్రజలు, పార్టీ నాయకులే నన్ము గెలిపిస్తారు.
– నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి
నిత్యం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్న నాకు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తా లేక కొందరు నాపై నీచమైన ఆరోపణలు చేయించారు. నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని శిఖండి రాజకీ యాలు చేశారు. కానీ జనాలు అవి ఏం పట్టించుకోకుండా నాకు మద్దతుగా నిలిచారు. సీఎం కేసీఆర్ ప్రకటనపై పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. బెల్లంపల్లిలో గతంలోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి చూపిస్తా. నాపై విశ్వాసం ఉంచిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి
నామీద నమ్మకంతో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఆదరిస్తున్న నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిర్మల్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్నది. మూడో సారి అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. భవిష్యత్తులో నిర్మల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఇదే ఆదరాభిమానాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిపించాలని నిర్మల్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నా.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో నాటుకుపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రంలో కానీ, అటు కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వాలు అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం. దాని వల్లే ప్రజల మన్ననలను పొందగలిగాం. ప్రజల్లో నాపై ఉన్న సానుకూలతను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని భావిస్తున్నా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి గెలిచి ముథోల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– జీ.విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనుభవం ఉన్నది. రాబోయే రోజుల్లో ఖానాపూర్ నియోజ కవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. 10ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేస్తా. నాపై నమ్మకంతో ఖానాపూర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
– భూక్యా జాన్సన్ నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యేఅభ్యర్థి
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నాకు నాలుగోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నాపై ఉన్న విశ్వాసంతో సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆయనకు రుణపడి ఉంటా. నన్ను ఆశీర్వదిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను జీవితాంతం మరిచిపోను. నాయకులు. కార్యకర్తలు, ప్రజల సహకారంతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తా.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
బీఆర్ఎస్ పార్టీ కష్టపడే కార్యకర్తను గుర్తించి సమ యం వచ్చినప్పుడు అవకాశం కల్పిస్తుంది. అందులో భాగంగానే బోథ్ శాసనసభ బీఆర్ ఎస్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నాపై ఉన్న ఉంచి న నమ్మకాన్ని వమ్ము చేయను. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావ్‌కు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నకు కృతజ్ఞతలు. బోథ్ నియోజకవర్గంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.
– జాదవ్ అనిల్‌కుమార్, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టికెట్ కేయించటం సంతోషం. పార్టీ అధినేత నమ్మకాన్ని నిలబెడతా. గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తా. ప్రజల ఆశీర్వాదంతో నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి