నిర్మల్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : ప్రయాణికులే తమ దేవుళ్లనే ఆర్టీసీ నినాదంపై ప్రస్తుత ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ సంస్థకు పూర్వ వైభవం చేకూర్చింది. దీనికోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేసింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి, వారికి అన్ని రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అందేలా కృషి చేసింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి ఆర్టీసీని సంక్షోభం దిశగా నెట్టేసిందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అంటూ వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా బస్సులను సమకూర్చకపోవడంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం, ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కో బస్సులో కెపాసిటీకి మూడింతలు ఎక్కువగా ప్రయాణీకులు.. కిక్కిరిసి తమ గమ్యాలకు చేర్చాల్సి వస్తున్నది. దీని కారణంగా బస్సులు ఓవర్‌లోడ్‌తో చెడిపోవడమే కాకుండా, కొన్నిసార్లు టైర్లు ఊడిపోతున్నాయి. అక్కడక్కడా టైర్లు పేలిపోయిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
నిర్మల్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు నిర్మల్ నుంచి జగిత్యాలకు వెళ్తుండగా రాయికల్ గ్రామం వద్దకు చేరుకోగానే బస్సు టైరు పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అలాగే నెల రోజుల క్రితం ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తుండగా నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక టైర్లకు అనుసంధానంగా ఉన్న రాడ్డు విరిగిపోయింది. దీనికి కారణం ఓవర్లోడేనని నిర్ధారించారు. ఈ సంఘటనలు మరువక ముందే తాజాగా శనివారం నిర్మల్ డిపోకే చెందిన పల్లెవెలుగు బస్సు జగిత్యాల నుండి నిర్మల్‌కు తిరిగి వస్తుండగా మోరపెల్లి గ్రామం వద్ద బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మూడు సంఘటనలు కూడా పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపకపోవడంతోనే ఓవర్‌లోడ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. దీంతో ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తున్నది. ఒకప్పుడు ఆర్టీసీ అంటే భద్రతతో కూడిన ప్రయాణం అనేవారు. కానీ.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడా నమ్మకం సన్నగిల్లుతున్నది. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆర్టీసీ మనుగడను కాపాడుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం క్రమంగా ప్రైవేటు(అద్దె) బస్సుల కే ప్రాధాన్యతనిస్తుండడం సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. ప్రైవేటు బస్సుల ఇష్టారాజ్యం ప్రస్తుతం ఆర్టీసీలో యథేచ్ఛగా కొనసాగుతున్నది. జిల్లాలోని నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోల్లోని అధికారులు అద్దె బస్సులకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని రెండు డిపోల్లో మొత్తం 220 బస్సులను నడుపుతుండగా, వీటిలో అద్దె బస్సులు 124 ఉండగా, ఆర్టీసీ బస్సులు 96 మాత్రమే ఉన్నాయి. నిర్మల్ డిపోలో మొత్తం 143 బస్సులకు 77 అద్దె బస్సులు, 66 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. భైంసా డిపోలో 77 బస్సులు ఉండగా, వీటిలో అద్దె బస్సులు 47, ఆర్టీసీ బస్సులు 30 ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులన్నీ ప్రైవేటు యాజమాన్యాలకే చెందినవి కావడంతో వాటి మరమ్మతులు, నిర్వహణపై ఆర్టీసీకి పట్టు ఉండడం లేదంటున్నారు. దీనికారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టైర్లు పేలిపోవడం, ఊడిపోవడం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా బస్సుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా.. శనివారం జరిగిన బస్సు టైర్లు ఊడిపోయిన ఘటనకు సంబంధించి నిర్మల్ డిపో మేనేజర్‌ను వివరణ కోరగా… సదరు బస్సు టైరు ఒకరోజు ముందు పంక్చర్ కావడంతో మరమ్మతు అనంతరం తిరిగి సరిగ్గా బిగించకపోవడం వల్లే ఊడిపోయినట్లు భావిస్తున్నామన్నారు.