సారంగాపూర్, మార్చి 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లోని రైతు వేదికలో శనివారం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేవారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబాక్ ద్వారా తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పెండ్లి చేయగలుగుతున్నారన్నారు. అలాగే రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచితంగా 24 గంటల కరంట్, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, గ్రామపంచాయతీల అభివృద్ధికి నెలనెలా నిధులు, మత్స్యకారులకు సబ్సిడీ కింద చేపపిల్లల పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, తదితర పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
రాంరావ్ మహారాజ్ విగ్రహావిష్కరణ..
మహారాష్ట్రలోని దయాళ్దనోరా గ్రామంలో రాంరావ్ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్లను నియమించారని తెలిపారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ వరకు అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రచారం ప్రారంభిస్తామన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కేసీఆర్ ప్రవేశపెడుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ వెంకట్ రమణారెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇప్ప మధుకర్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఏవో రాజశేఖర్‌రెడ్డి, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సారెడ్డి, నాగుల రాంరెడ్డి, రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
వశిష్ట పాఠశాల వార్షికోత్సవం..
నిర్మల్ అర్బన్, మార్చి 11 : పట్టణంలోని వశిష్ట ఇంపర్స్ పాఠశాలలో శనివారం రాత్రి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట ప్రభుత్వం విద్యపరంగా అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చేసిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, వశిష్ట పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, అన్వర్, గజేందర్, ఆకోజి కిషన్ ఉపాధ్యాయులు తదితరులున్నారు.
నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
దిలావర్పూర్, మార్చి 11 : మండలంలోని న్యూ లోలంలో దిలావర్పూర్, నర్సాపూర్(జీ)మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి అల్లోల ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారని తహసీల్దార్ ఖరీం తెలిపారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన..
న్యూ లోలం నుంచి దిలావర్పూర్తండాకు బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, సర్పంచ్ ఓడ్నం సవిత తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు.
సాకెర గ్రామ స్వాగత తోరణం ప్రారంభోత్సవం..
నిర్మల్ టౌన్, మార్చి 11 : సోన్ మండలం సాకెర గ్రామ స్వాగత తోరణాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించనున్నట్లు సర్పంచ్ సుంచు సుప్రజ శ్రీనివాస్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై, విజయవంతం చేయాలని కోరారు. గ్రామానికి చెందిన భవాని-శంకర్ దంపతుల సహకారంతో నిర్మించినట్లు పేర్కొన్నారు.