ఏ జాతి జంతువునైనా వేటాడేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ఫలితంగా వందల రకాల జంతువులు, పక్షులు కనుమరుగవుతాయి. తాజా సవరణతో ఏనుగులతో వాణిజ్యం చేసుకోవచ్చు. వాటి మనుగడ ప్రశ్నార్థకం కానున్నది.
జీవవైవిధ్యాన్ని వాడుకొనే అవకాశం విదేశీ సంస్థలకు కలుగుతుంది. ఫలితంగా అటవీ సంపదను దోచుకుపోయేందుకు మార్గం సుగమమవుతుంది. విలువైన ఔషధ మొక్కలు, జీవరాశులపై పేటెంట్ విదేశాలు, కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయి. ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది.
కేంద్ర సర్కారు ప్రైవేటు జపం చేస్తున్నది. ప్రభుత్వాలకు ఆదాయవనరులుగా ఉన్న సంస్థలను బడా కంపెనీలకు ధారాదత్తం చేయాలని కుట్ర పన్నుతున్నది. మొన్నటి వరకు సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని చూడగా.. తాజాగా అటవీ హక్కులను కాలరాసి అడవులను అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నది. వన్య ప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు సవరణ చేసి అడవులపై తమ ఆధిపత్యాన్ని చాటాలని పావులు కదుపుతున్నది. ఫలితంగా అడవులు, వన్యప్రాణులకు పెనుముప్పు వాటిల్లనుండగా గిరిజన సంస్కృతి ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో కేంద్రం తీరుపై అడవిబిడ్డలు మండిపడుతుండగా.. ఆందోళనలు చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 27 : కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు అటవీ హక్కులను కాలరాసేందుకు కుట్ర పన్నుతున్నది. అటవీ సంపదను పరిరక్షించాల్సిన కేంద్రమే సవరణ పేరిట కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఉన్న అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నది. సులభతర వాణిజ్యానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకు జనవరి 17, 24న ఆర్డర్లు కూడా పంపింది. ఈ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కూడా తీవ్రంగా పడనుంది. వన్యప్రాణి సంరక్షణ కూడా జీవన వైవిధ్యంతో ముడిపడి ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్ర అధికారాలకు కత్తెర వేస్తూ ఇటీవల రెండు బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో మొదటిది వన్యప్రాణి సంరక్షణ చట్టం(1972), జీవ వైవిధ్య చట్టం(2002) సవరణలు కోరుతూ పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో జీవ వైవిధ్యం బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీకి.. వన్యప్రాణి సంరక్షణ బిల్లు పార్లమెంట్ స్టాడింగ్ కమిటీకి పంపింది. ఈ కమిటీలు అన్ని రాష్ర్టాల అభిప్రాయలను తీసుకొని సవరణ చేయాల్సి ఉన్నప్పటికీ ఇవేమి పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో అటవీ హక్కులను, చట్టాలను బలహీన పరిచే విధంగా కేంద్రం చూస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లా వన్యప్రాణి ప్రేమికులు, గిరిజనులు, పర్యావరణ ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకృతితో పరాచికాలు ఆడుతున్నది. వన్యప్రాణి, జీవ వైవిధ్య చట్టాల సవరణ పేరిట రాష్ట్ర హక్కులను కాలరాయాలని చూస్తున్నది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో అటవీ సంపద విదేశీ కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటే.. కేంద్రం అటవీ సంపదను ప్రైవేట్‌పరం చేసి జీవ వైవిధ్య విధానానికి తూట్లు పొడుస్తున్నది. భవిష్యత్‌లో జీవరాశులపై తీవ్రంగా ప్రభావం పడనుంది. కేంద్ర విధానాలపై అన్ని రాష్ర్టాలతో కలిసి పోరాడుతాం.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు రాష్ట్రంలోనే అడవుల విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఆదిలాబాద్ భూవిస్తీర్ణం 16,105 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో 5,743.40 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 42.72 శాతం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 54.41, నిర్మల్‌లో 32.79, మంచిర్యాలలో 45.15 శాతం అడవులు ఉన్నాయి. 150.05 చదరపు కిలోమీటర్లు దట్టమైన అడవులు, 3,244.05 మధ్యస్థ, 2,349.12 మైదాన అడవులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ప్రధానంగా 100 రకాల అడవి జంతువులు, 36 రకాల పక్షులు, 8 రకాల ఖనిజాలు, 136 రకాల వృక్షజాతులు, 200కు పైగా సరిసృపాలు, సూక్ష్మ జీవులు, ఉభయచర జీవులున్నాయి. అడవికి, వన్యప్రాణులకు విడదీయలేని బంధం ఉంది. కేంద్రం అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం వల్ల జీవన వైవిధ్యం లోపించి జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అటవీ ప్రాంతంలో వాణిజ్య అవసరాలకు స్థానిక, రాష్ట్ర పరిరక్షణ కమిటీలు ఆమోదించి జాతీయ స్థాయిలో జాతీయ జీవన వైవిధ్య మండలికి సిఫారసు చేస్తేనే అటవీ భూములను ప్రైవేటు వారికి అప్పగించే అవకాశం ఉండేది. ఇప్పుడు స్థానిక, రాష్ట్ర కమిటీల సిఫారసు లేకుండానే కేంద్రం అటవీ భూములను ప్రైవేటుకు అప్పగించే అవకాశం కలుగనుంది. అనుమతి పొందిన కార్పొరేట్ సంస్థలు అడవుల్లోని ఖనిజాలు, జంతు, అటవీ సంపదపై పూర్తి హక్కులు వర్తించనుండడంతో అడవులపై ఆధారపడి బతికే వారు జీవనాధారం కోల్పోతారు.
వన్యప్రాణి సంరక్షణకు ఐదు దశాబ్దాల క్రితం చట్టం రూపొందగా.. ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి నేతృత్వంలో 20 మంది సభ్యులతో కూడిన కమిటీ వన్యప్రాణులను సంరక్షిస్తున్నది. ఈ కమిటీ వన్యప్రాణులకు హానీ కలిగించకుండా జీవన విధానం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం వన్యప్రాణి, జీవవైవిధ్య సంరక్షణ చట్టాలలో సవరణ చేయడం వల్ల ఉమ్మడి జిల్లాలోని అడవులు, జీవరాశులకు హానీ కలిగే అవకాశం ఉందని జీవరాశుల పరిరక్షణ సమితి మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంతువుల రక్షణకు తెలంగాణ సర్కారు కఠినమైన చట్టాలు తీసుకొస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం బలహీనపరిచే విధంగా చేస్తున్నది. ఫలితంగా అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లకు అవకాశం లభించే ఆస్కారం ఉంది. దీంతో జంతువులను వేటాడే అవకాశం ఉండడంతో జీవరాశులపై ప్రభావం పడనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27,41,239 జనాభా ఉండగా.. ఇందులో గిరిజనులు 5,15,791 మంది ఉన్నారు. వీరంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,507 గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 600లకు పైగా తండాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వీరంతా అటవీ ప్రాంతంలో ఉంటూ అటవీ వనరులతో జీవనం సాగిస్తున్నారు. ఈ చట్ట సవరణ చేయడం వల్ల అడవుల్లో ఉన్న జంతు సంపద కరిగిపోవడం, జీవన వైవిధ్యం లోపించడం, ప్రకృతి సమతుల్యత దెబ్బతినే ఆస్కారం ఉంది. అడవులను ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలు విధ్వంసకర చర్యలకు పాల్పడి.. గిరిజనులు ఆ ప్రాంతంలో హక్కులను కోల్పోయే అవకాశం ఉండడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవన వైవిధ్యం, వన్యప్రాణి పరిరక్షణకు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యల వల్ల అటవీ సంపదపై ఆశలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగించే విషయం.
కేంద్రం అటవీ సంపదను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు చేస్తున్న కుట్రల వల్ల ఉమ్మడి జిల్లాలోని జీవరాశులపై ప్రభావం పడనుంది. అడవుల్లో నివసించే జంతువులు, పక్షుల మనుగడ కష్టంగా మారనుంది. ఖనిజ సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతున్నదని భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుంటే కేంద్రం అడవుల వినాశనానికి సవరణలు చేయడం భవిష్యత్ తరాలకు మంచిదికాదు. కేంద్రం పునరాలోచించాలి.
– కోటేశ్వర్రావు, ఎఫ్‌డీవో, నిర్మల్.
అడవులే ఆవాసాలుగా గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. జీవ వైవిధ్య, వన్యప్రాణి సంరక్షణ చట్టాలను సవరణ చేయడం వల్ల గిరిజనులపై తీవ్ర ప్రభావం పడనుంది. అటవీ ప్రాంతంలో నివసిస్తూ అటవీ ఉత్పత్తులే ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. గిరిజనుల హక్కులను కాలరాసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అడవుల్లో కార్పొరేట్ సంస్థలు చొరబడితే గిరిజనుల సంస్కృతీసంప్రదాయాలకు విఘాతం కలుగుతుంది.
– భీంరావు, తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం జల్లా నాయకుడు.
ప్రకృతిని పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రస్తుతం ఉమ్మడి జల్లాలోని అడవులు ఎక్కువగా ఉండడం వల్లనే రాష్ట్రంలో ఎక్కువగా జీవరాశులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటు న్నాయి. గిరిజనులు కూడా అటవీ ఉత్పత్తుల ఆధా రంగా జీవనాన్ని సాగిస్తున్నారు. అడవులు వృద్ధి చెందినప్పుడే వర్షాలు కురిసి పర్యావరణ పరిరక్షణకు అవకాశం పెరిగి పంటలు కూడా బాగా పండుతాయి. అటువంటి జీవన వైవిధ్యం పొందిన అడవులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న సవరణలు వెంటనే ఆపాలి. – చంద్రకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్.