మంచిర్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సీసీఐ కొనుగోళ్లు పర్వాలేదనిపిస్తున్నా, మంచిర్యాల జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రాలు మాటిమాటికీ మూసి ఉంటుండడంతో కర్షకలోకం అవస్థలు పడుతున్నది. ప్రస్తుతం ఎక్కడా పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదని, తమ గోడును పట్టించుకోవాలని వేడుకుంటున్నది. చెన్నూర్ మండలంలో నాలుగు కేంద్రాలు, కోటపల్లిలో ఒకటి, బెల్లంపల్లి పరిధిలోని రెండు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి, గింజల నిల్వలు అధికంగా ఉన్నందున కేంద్రాలు బంద్ చేసినట్లు మార్కె ట్ కమిటీలు చెబుతున్నాయి.
మూడు, నాలు గు రోజులు ఇలాగే బంద్ ఉంటాయంటూ ప్ర కటనలు సైతం విడుదల చేశాయి. మరోవైపు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు రావడంతో 8, 9 తేదీల్లోనూ కొనుగోళ్లు జరిగేలా లేవు. ఈ లెక్కన ఈవారం మొత్తంలో ఒకటీ, రెండు రోజులు మినహా 10వ తేదీ దాకా కొనుగోళ్లు చేపట్టే అవకాశం లేదు. ఇలా ఈ నెలలోనే కాదు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి కొనుగోళ్లు చేసిన దానికంటే మూసి ఉన్న రోజులే ఎక్కువని రైతులు మండిపడుతున్నారు. రైతులను ముంచేందుకే వ్యాపారులు, అధికారులు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేక పత్తి దిగుబడి తగ్గిందని.. సీసీఐలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు తకువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దళారులకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడులు సైతం రాక అప్పుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలు బంద్ లేకుండా, సీజన్ పూర్తయ్యే దాకా పత్తి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేక ప్రైవేట్‌కు అమ్ముతున్నా
సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్ చేయడంతో చేతికి వచ్చిన పత్తి పంటను దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడికి, కూలీలకు ఇచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తకువ ధరకు పత్తిని ప్రైవేట్‌కు అమ్ముకొని నిలువునా మునుగుతున్నాం. నేను బోయపల్లి-మదనాపూర్ శివారులో 8 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సీసీఐలో అమ్ముకుందామని పోతే ఎప్పుడూ బందే ఉంటుంది. పత్తి కొనుగోళ్లు మొదలైన రోజు నుంచి కొనుగోలు కేంద్రం తీసి ఉన్నదానికంటే మూసి ఉన్న రోజులే ఎక్కువ. ఈ ఏడాది రైతుబంధు రాలేదు, రుణమాఫీ కూడా సక్కగ కాక రైతులందరం అవస్థలు పడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. పత్తి తీసిన కూలీలకు డబ్బులు ఇవ్వడానికి అప్పు చేయాల్సి వస్తున్నది. సీసీఐ కొనుగోళ్లు చీటికీమాటికీ బంద్ చేయడంతో 30 క్వింటాళ్ల పత్తి ప్రైవేట్‌కు అమ్ముకునేందుకు సిద్ధమయ్యా.
– మాసాడి నాగరాజు, బోయపల్లి, తాండూర్
ఆదేశాలు రాగానే కొనుగోళ్లు చేపడుతాం
జిన్నింగ్ మిల్లులో పత్తి నిల్వలు పేరుకుపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడం జరిగింది. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలు రాగానే చెన్నూర్‌లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపడుతాం. రోజుకు 50 నుంచి 100 పత్తి బండ్లకు టోకెన్స్ ఇచ్చి కొనుగోళ్లు చేపడుతాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు ఒకేసారి కాకుండా దశలవారీగా పత్తిని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం.
– రామాంజనేయులు, చెన్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ
కొనుగోళ్లు నిలిపేసి పది రోజులు దాటింది
నా దగ్గర పది నుంచి పదిహేను క్వింటాళ్ల పత్తి ఉంది. సీసీఐకి అమ్ముదామని ఎదురుచూస్తున్నా. చెన్నూర్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. నాలాంటి రైతులెందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రామంలో రైతులు కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా సక్రమంగా పత్తి కొన్నది లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు కొనుగోలు చేస్తే, మిగిలిన రోజులు బంద్ పెడుతున్నారు. ఆగితే ఆగండి లేకపోతే బయట అమ్ముకోండంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలిస్తున్నారు. రైతు డేటా లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు పత్తికి బదులు వరి సాగు చేసినట్లు తప్పుడు ఎంట్రీ చేస్తే దానికి రైతు ఏం చేస్తాడు. అలాగని కొనకపోతే ఎలా. ఎదురుచూసి ఇక పంట ఎక్కడ పాడైపోతుందోనని కొందరు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారు. మండలంలో ఇప్పటి వరకు 50 శాతం రైతులే సీసీఐకి పత్తిని విక్రయించారు. అనేక మంది పత్తి ఇండ్లలోనే నిల్వచేసుకొని ఎప్పుడు సీసీఐ కొనుగోళ్లు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మా మండలంలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసి 10 రోజులు దాటింది. వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నాం.
– నరిగె శ్రీశైలం, రైతు, కాచన్‌పల్లి గ్రామం, చెన్నూర్
ఇంట్లోనే పత్తి నిల్వ చేసుకున్నా
పత్తి తీయడం మొదలైనప్పటి నుంచి సీసీఐ వాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. నేను బోయపల్లి గ్రామ శివారులో 13 ఎకరాల్లో పంట సాగు చేశాను. సుమారు 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. విడుతల వారీగా పత్తి అమ్మడానికి తాండూర్ మండలంలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకుపోతే బంద్ ఉంది. దళారులకు అమ్మితే నష్టపోయే ప్రమాదముందని ఇంట్లోనే పత్తిని నిల్వ చేశాను. సీసీఐ కొనుగోలు కేంద్రం నెలలో కొన్ని రోజులే తెరుస్తుండడంతో రైతులందరం నష్టపోతున్నాం. పత్తికి సరైన మద్దతు ధర ఇవ్వాలి. ఇప్పుడున్న ధరకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. క్వింటాలుకు రూ.10 వేలు ప్రకటించాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో క్వింటాలుకు రూ.9 వేలు ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఇప్పుడున్న నాయకులెవ్వరూ చొరవ చూపడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట విక్రయించడానికి అష్టకష్టాలు పడుతున్నాం. పత్తి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడూ మూసి ఉండండతో నాతోటి రైతులు చేసేదేమీ పత్తి మిల్లుల యాజమానుల, దళారులను ఆశ్రయిస్తున్నారు. అడ్డికి పావుశేరు వాళ్లు అడిగే ధరకు పంట అమ్ముకొని నష్టపోతున్నాం. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది. పత్తి నిల్వ చేయడానికి స్థలం లేకపోయే. పత్తి ఏరిన కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుండే.. ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక ప్రైవేట్ వ్యాపారులే మాకు దిక్కు అవుతున్నారు.
– మాసాడి శశివర్ధన్, బోయపల్లి గ్రామం, తాండూర్