మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు మూడో విడుత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యింది. దీంతో గ్రామాల్లో ఎలక్షన్ల హీట్ పెరిగింది. తొలి విడుత ప్రచారం ముగిసిన నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు తమ మద్దతుదారులు పోటీ చేసే రెండో విడుత ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
మొదటి విడుతకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 506 గ్రామాలు, 4,222 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం, మరికొన్ని స్థానాల్లో అసలు నామినేషన్లు పడకపోవడంతో వాటిని మినహాయించి మిగిలిన స్థానాలకు రేపు(డిసెంబర్ 11న) ఎన్నికలు నిర్వహించనున్నారు.
గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గ్రామాల్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు రోజైన బుధవారం అభ్యర్థులకు కీలకంగా మారింది.
ఓటర్లకు ఎలాగైనా డబ్బులు చేరేలా కొందరు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డు మెంబర్లు/సర్పంచ్ అభ్యర్థులు ఎవరికి వారు ఓటర్లకు ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారని నిఘా పెట్టి అవతలి వాళ్లు ఏం ఇచ్చారు. మేము ఏం ఇవ్వాంటూ ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు.. ఎలాగైనా సరే ఒటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనికి అధికారులు ఎంత వరకు అడ్డుకట్ట వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మంచిర్యాల జిల్లాలో తొలి విడుతలో 90 గ్రామ పంచాయతీల ఎన్నికలు ఉండగా ఆరు చోట్ల ఏకగ్రీవం అయ్యారు. మరో మూడు చోట్ల నామినేషన్లు పడలేదు. దీంతో మిగిలిన 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 258 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇక 816 వార్డులకు 34 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 268 వార్డుల్లో ఏకగ్రీవం కాగా మిగిలిన 514 వార్డుల్లో 1476 మంది బరిలో నిలిచారు.
నిర్మల్ జిల్లాలో తొలి విడుతలో 136 సర్పంచ్ స్థానాలకు 16 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఒక గ్రామంలో నామినేషన్ రాలేదు. మిగిలిన 125 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా సర్పంచ్‌లుగా 459 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 1072 వార్డు మెంబర్ స్థానాల్లో ఏడు చోట్ల నామినేషన్ పడలేదు. 474 వార్డుల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 594 వార్డుల్లో ఎన్నికలకు వెళ్తుండగా 1373 బరిలో ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ స్థానాలకు ఏడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 107 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా 396 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 944 వార్డుల్లో 579 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 368 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 1424 మంది బరిలో ఉన్నారు.
