దహెగాం, మార్చి 8 : మండలంలోని కొంచవెల్లిలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండగా, పొట్టకొచ్చే దశలోనున్న పంటలు ఎండిపోతున్నాయి. పక్షం రోజుల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు మార్చినా ఫలితం లేకపోగా, కష్టనష్టాలకోర్చి వేసిన వరి చేతికందకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. తాజాగా.. మరో ట్రాన్స్ఫార్మర్ అమర్చినట్లు తెలుస్తుండగా, లో వోల్టేజీ సమస్య వల్ల ఇదైనా పనిచేస్తుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఎండిన వరి..
యాసంగిలో కొంచవెల్లి రైతులు బోర్లపై ఆధారపడి వరి సాగు చేశారు. కరెంట్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 23న కెనాల్ ఏరియాలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. ‘పంటలు ఎండిపోతున్నాయి.. జర పట్టించుకోండి సారూ’ అంటూ రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొరపెట్టుకోగా, ఈ నెల 3న కొత్త ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. అది ఆన్ చేయగానే కాలిపోయింది.
ఈ నెల 7(శుక్రవారం)న మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ఆన్ చేయగా, అది కూడా కాలిపోయింది. సాంకేతిక లోపాల కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండగా, సుమారు 40 ఎకరాల్లో వేసిన వరి చేతికందకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా వరకు పంట ఎండిపోగా, దిగుబడిపై ప్రభావం చూపే అవకాశమున్నది. కేసీఆర్ సర్కారులో 24 గంటల కరెంట్‌తో రంది లేకుంట పంటలు తీశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యామాని బతుకులు ఆగమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
ఇదైనా పనిచేసేనా..?
కొంచవెల్లిలో తరచూ విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. లో వోల్టేజీ వల్లే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నట్లు తెలుస్తున్నది. పక్షం రోజుల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు మార్చినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా.. శనివారం మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుండగా, ఇదైనా పనిచేస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు.
నాలుగెకరాల్లో వరి ఎండిపోతుంది
మా ఊరిలో నాకు నాలుగె కరాలు ఉంది. అందులో వరి వేసిన. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సార్ల చుట్టూ తిరిగితే అమర్చిన్రు. అది కూడా కాలిపోయింది. ఇప్పటికి రెండుసార్లు గిట్లనే అయ్యింది. ఇప్పటికీ పక్షం రోజులైతంది పంటకు నీళ్లులేక. కండ్లముందే పంట ఎండిపోతుంటే ఏం చేయాలో తోచడం లేదు. అప్పులు చేసి పంటలేస్తిమి. ఇప్పుడు మాకు దిక్కెవరు.
– వెంకటేశ్, రైతు, కొంచవెల్లి
దు:ఖం వస్తుంది
తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపో తున్నయి. బోర్లు పోయక కండ్లముందే పంట ఎండి పోతుంటే దు:ఖం వస్తుం ది. సాంకేతిక లోపాల వల్ల ఇప్పటికీ మూడుసార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అధికారులు విద్యు త్ లేన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతు లు చేస్తే ఇలా అయ్యేది కాదు. కేసీఆర్ సర్కారులో రంది లేకుంట పంటలు తీసినం. గిప్పుడు గిసొంటి గోస వచ్చింది.
– రావూజీ, రైతు, కొంచవెల్లి