భైంసా, ఫిబ్రవరి 5 : నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలతో 2011లో నిర్వహించిన కుల గణనలో తమకు తక్కువగా చూపించి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించగా మాలలు మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్చంద్రే, గౌతం పింగ్లే, ప్రసన్నజిత్ ఆగ్రే, దేవీదాస్ హస్డే, రాహుల్, మాణిక్, గంగాధర్ దగ్డే, లక్ష్మణ్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాలని మాల సంక్షేమ సంఘం మండల శాఖాధ్యక్షుడు ఎల్క రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో అంబేదర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో రాజ్యాంగం ప్రకారం బిల్లు పెట్టి వర్గీకరణ చేయాలన్నారు. వర్గీకరణ బిల్లు పత్రాలను దహనం చేశారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి మునేశ్వర్ సోమన్న, ఉపాధ్యక్షుడు సందీప్, కోశాధికారి లక్ష్మణ్, బోథ్ కమిటీ అధ్యక్షుడు సురేందర్, ఉపాధ్యక్షుడు ఊశన్న, సొనాల గ్రామ కమిటీ కార్యదర్శి అమృత్ రావ్ పాటిల్, కన్గుట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామి, కుచులాపుర్ అధ్యక్షుడు భూమేశ్, పొచ్చెర గ్రామ కమిటీ సభ్యులు రమేశ్, సాగర్, స్వామి పాల్గొన్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 5: ఎస్సీ వర్గీకరణను ఏబీసీలుగా విభజించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమోదం తెలపడం సరికాదని మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని అంబేద్కర్ చౌక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణతో మాల నేతకాని మహార్లకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాటం రమేశ్, సింగారే భరత్, మహేందర్, జాడి వెంకటేశ్, ఆశన్న, ముకుంద్, కేశవ్ పాల్గొన్నారు.