హైదరాబాద్, ఆట ప్రతినిధి : కెన్యా సఫారీ ర్యాలీ డబ్ల్యూఆర్సీ3 రేసింగ్‌లో భారత జోడీ నవీన్ పులిగిల్ల, ముసా షరీఫ్ సత్తాచాటారు. ఎఫ్ఐఏ వరల్డ్ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో భాగంగా నైవీశాలో జరిగిన రేసులో హైదరాబాదీ నవీన్, ముసాతో మూడో స్థానంతో పోడియం ఫినిష్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య జరిగిన ర్యాలీలో నవీన్, ముసా ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ర్యాలీని 5 గంటల 22 నిమిషాల 17.9 సెకన్లలో ముగించిన ఈ జోడీ డబ్ల్యూర్సీ3 క్లాస్‌లో మూడో స్థానంతో పాటు ఆఫ్రికన్ ఏఆర్సీ3 క్లాస్‌లో రెండో స్థానం దక్కించుకుంది. అత్యంత హయ్యర్ క్లాస్ కార్లు పోటీపడ్డ రేసులో ఓవరాల్‌గా 24వ స్థానంలో నిలిచి ఆకట్టుకుంది.
ఇటీవలే ఐఎన్ఆర్సీ 3టీ ఇండియన్ చాంపియన్‌గా నిలిచిన నవీన్..నైరోబీ ఆఫ్రికా ఈకో స్పోర్ట్స్‌లో ఫోర్డ్ ఫియెస్టా కార్‌తో 338.34కి.మీల దూరాన్ని చేరుకుని లక్ష్యాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ స్పందిస్తూ ‘ఆఫ్రికాలో అప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులకు తోడు, రాళ్లతో కూడిన ప్రమాదకరమైన రోడ్లు, సవాలు విసిరే మలుపులు, రేసర్ల సామర్థ్యానికి పరీక్ష పెడుతాయి. ఇది మేము ఒక ర్యాలీగా భావించలేదు, వేగం, నియంత్రణతో కూడిన క్రమశిక్షణతో సాగింది. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌తో పాటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.