న్యూఢిల్లీ, మార్చి 18 : దేశీయంగా ఫ్యూచర్ మార్కెట్లో మెటల్ ట్రేడింగ్ వెలవెలబోతున్నది. భౌగోళిక-రాజకీయ ప్రతికూల పరిణామాల నడుమ స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లో గతకొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ సహా ఆయా విలువైన లోహాల డిమాండ్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నది. బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, జింక్ లోహాల ధరలు బుధవారం కూడా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, కరెన్సీ మార్కెట్లో డాలర్లకు డిమాండ్, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు, ఈసారి ద్రవ్య సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు.. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. కాగా, మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు.. సాధారణ వినియోగదారులతోపాటు రిటైల్ వ్యాపారులనూ కొనుగోలుకు దూరం చేస్తున్నాయి.
ఏప్రిల్ డెలివరీకిగాను 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర గత 4 రోజుల్లో రూ.3,550 క్షీణించి రూ.1,55,729 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కొమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఏప్రిల్ కాంట్రాక్ట్‌లో ఔన్స్ గోల్డ్ రేటు 5,013.01 డాలర్లుగా ఉన్నది.
మే నెల డెలివరీకిగాను కిలో వెండి ధర గడిచిన 4 రోజుల్లో రూ.9,708 పతనమై రూ.2,52,900 వద్ద ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ కొమెక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ మే కాంట్రాక్ట్కుగాను ఔన్స్ విలువ 79.68 డాలర్ల వద్ద ముగిసింది.
ఏప్రిల్ డెలివరీ కోసం కిలో రాగి, అల్యూమినియం, జింక్ ధరలూ గతకొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో రాగి రూ.1,186.80 వద్దకు దిగజారితే.. అల్యూమినియం రూ.337.80కు పరిమితమైంది. ఇక జింక్ ధర రూ.316.25గానే ఉన్నది. కాగా, దేశీయ పారిశ్రామిక రంగం నుంచి ఆయా లోహాలకు డిమాండ్ మందగిస్తున్నదని, అందుకే ఈ ధరల క్షీణతని ట్రేడర్లు చెప్తున్నారు.
బంగారం, వెండి ధరలు స్పాట్ మార్కెట్లో మళ్లీ పడిపోయాయి. బుధవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.6,000 క్షీణించి రూ.2,56,500 వద్ద స్థిరపడింది. అలాగే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం రేటు రూ.1,000 దిగి రూ.1,60,300గా ఉన్నది. ట్రేడర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా సరళిని విశ్లేషిస్తున్నది. కాగా, హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పుత్తడి విలువ రూ.1,44,600గా నమోదైంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వ్యాల్యూ 16.10 డాలర్లు పతనమై 4,989.65 డాలర్ల వద్ద ఆగింది. సిల్వర్ 79.92 డాలర్లు పలికింది.