Abhijeet Dipke : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఉన్నత విద్యకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని చెప్పారు. బోస్టన్ యూనివర్సిటీ (Bostan University) ఇచ్చిన స్కాలర్‌షిప్‌తోపాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో దీప్కే మాట్లాడుతూ.. ‘నాకు యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. అలాగే విద్యారుణం కూడా తీసుకున్నా. దానిని ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నా’ అని తెలిపారు.
సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని పలు సంస్థలను కోరారు. ఈ సందర్భంగా సీజేపీ నిధులపై వస్తున్న ప్రశ్నల దీప్కే సమాధానమిచ్చారు. భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు. ప్రతి రూపాయి లెక్కను పారదర్శకంగా వెల్లడిస్తామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో ప్రజలే ఆహారం, తాగునీరు అందించి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
మరోవైపు సీజేపీ ప్రతినిధి వైష్ణవి గౌర్ ఆర్టీఐ కార్యకర్తపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విద్యా ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తేవారు ఇతర నిధుల దుర్వినియోగంపై ఎందుకు దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.