Janaki | ఫ్రిస్కో, టెక్సాస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ)కి సంగీత నివాళిగా శనివారం డల్లాస్లోని తెలుగు కళాభిమానులు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో నిర్వహించారు. డల్లాస్ మెట్రోప్లెక్స్లోని పలువురు ప్రతిభావంతులైన గాయని, గాయకులు జానకి పాడిన అజరామరమైన గీతాలను పాడి సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గాయనిగా శిష్ట్లా జానకి పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించడం విశేషమని అన్నారు. హాస్యపాత్రల స్వరం, రెండేళ్ల పసిపాప నుంచి తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకు ఏ స్వరాన్నాయినా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం ఆమెకే సొంతమని తెలిపారు. ఏ భాషలో పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్ఛారణతో పాడటం గొప్ప విషయమని అన్నారు. సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు వంటి ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం గొప్పదని పేర్కొన్నారు. ఎన్నో వేల పాటలు పాడి, అనేక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినే అటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అని వెల్లడించారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల భాషల్లో 50,000 కు పైగా పాటలు పాడిన జానకి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ నివాళి అర్పించారు.

Janaki
డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జానకి గానం భారతీయ సంగీతానికి అపూర్వమైన వరం అని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు. నిర్వాహకులు రామన్ వీరంరాజు, అనంత్ మల్లవరపు మాట్లాడుతూ.. విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. పరిమళ మార్పాక వ్యాఖ్యానం, బాల గణపవరపు అందించిన ఆడియో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Janaki 2