బెంగళూరు, మార్చి 18: రీల్స్ పిచ్చి తలకెక్కిన బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం ఒక వృద్ధుడిని పార్సిల్ చేసి కొరియర్లో పంపడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. ఉగాది, రంజాన్ సందర్భంగా బస్ చార్జీలు ఆకాశాన్నంటడంతో అంత చెల్లించకుండా సులభంగా పార్సిల్ ద్వారా గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో తమ వ్యూయర్లకు చెప్పేందుకు రీల్ చేయాలని సెంట్రల్ బెంగళూరులోని వ్యాలికావల్ ప్రాంతానికి ఒక కుటుంబం నిర్ణయించింది. ఆ కుటుంబంలోని ఒక మహిళ వృద్ధుడైన తన తండ్రిని గోనె సంచిలో కట్టేసి పార్సిల్ కింద ప్యాక్ చేసింది. దీనికి ఆమె భర్త, అత్తమామలు, మరిది సహకరించారు.
పార్సిల్‌ను కొరియర్ ఆఫీస్‌కు తీసుకుపోగా, వారు పార్సిల్లో ఏమి ఉందని అడిగారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానించి ఓపెన్ చేసి చూడగా, ఊపిరి అందని స్థితిలో ఉన్న వృద్ధుడు కన్పించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంజాన్ సందర్భంగా బస్, రైలు టికెట్ దొరక్కపోతే గమ్య స్థానానికి ఎలా చేరుకోవాలో తెలియజెప్పేందుకే అతడిని పార్సిల్ చేసి తెచ్చామని, ఇదంతా రీల్స్ కోసమే చేశామని ఆమె తెలిపింది.
ఒక వేళ ఆ పెద్దాయన ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటే ఏం చేసేవారని పోలీసులు తీవ్రంగా ప్రశ్నించి వారికి చీవాట్లు పెట్టారు. వారిని తీవ్రంగా హెచ్చరించి, ఆమె, ఆమె భర్త, అత్త, మరిదిలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కాగా, తండ్రి ప్రాణాలతో ఆ కుమార్తె చేసిన పనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని వ్యూస్, కామెంట్ల కోసం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు ఎంతకైనా తెగిస్తారంటూ విమర్శలు గుప్పించారు.
రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు
ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకువచ్చిన కూతురు
అయితే కొరియర్ ఆఫీసులో ఆ బస్తా లోపల ఏదో కదులుతుండటాన్ని గమనించిన అనుమానంతో మూట విప్పి చూసిన సిబ్బంది
ఇదేమిటని ఆ కుటుంబాన్ని… pic.twitter.com/g9v1x3RK5u
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2026