Brucellosis | దస్తురాబాద్, ఫిబ్రవరి 26;బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఇది బ్రూసెల్లా అబార్షన్ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. దీంతో పశువులకు బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వస్తుంది. చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి మనుషులకూ అంటుకుంటుంది. దీంతో మనుషుల్లో వృషణాల వాపుతో పాటు నపుంసకత్వం రావచ్చు. మహిళలకైతే అబార్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణకు వ్యాక్సిన్లు వచ్చాయని, రైతులందరూ తప్పనిసరిగా 4 నుంచి 9 నెలల వయసులోపున్న బర్రె, ఆవు దూడలకు టీకాలు వేయించాలని పశు వైద్యులు సూచిస్తున్నారు.
పశు సంపదకు బ్రూసెల్లోసిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారింది. బ్రూసెల్లా అబార్షన్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది పశువులకు సోకుతుంది. వాటి ద్వారా మనుషులకు సైతం వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పశు సంరక్ష ణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పశువులకు ఏ వ్యాధి వచ్చినా వెంటనే వైద్య సేవలు అం దించేందుకు ఇప్పటికే సంచార వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రసుత్తం ప్రభుత్వం బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణే లక్ష్యంగా, పాడి సంపదను రక్షించుకునేందుకు అన్ని రకా ల చర్యలు చేపట్టింది. ప్రజావసరాలకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచేందుకు పశ సంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటున్నది.
తాజాగా ఆడదూడలకు బ్రూసెల్లా టీకాలు వేస్తున్నది. చూడి సమయంలో పశువుల్లో గర్భస్రావం కాకుండా 4 నుంచి 9 నెలల వయసులోపు గల బర్రె, ఆవు దూడలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు పోషకులకు వ్యాధులపై పశు వైధ్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. మండలంలో 684 బర్రె, ఆవు దూడలను గుర్తించి టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారులు తెలిపారు.
మనుషుల్లో లాగానే పశువుల్లో సైతం గర్భ విచ్ఛిత్తి జరిగే అవకాశం ఉంటుంది. మూడేండ్ల తర్వాత పశువులు ఎదకు వస్తాయి. ఈ క్రమంలో 7, 8, 9 నెలల్లో కొన్నింటికి గర్భస్రావం అవుతుంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పాల ఉత్పత్తికి మరో ఏడాది పాటు దూరంగా ఉండాల్సి వస్తుంది. పశువుల్లో గర్భవిచ్ఛిత్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బ్రూసెల్లా టీకాలను వేస్తున్నది.ఈ టీకా దూడలకు ఇవ్వడం వల్ల పశువుల జీవిత కాలంలో గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశం ఉండదని పశు వైద్యులు పేర్కొంటున్నారు. 4 నుంచి 9 నెలల వయసులోపు గల బర్రె, ఆవు దూడలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ప్రధానంగా ఈ వ్యాక్సిన్ వేయడంతో రైతులకు మేలు కలుగుతుంది. చాలా వరకు రైతులు మేలు జాతి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు. అందులో జెర్సీ, గీర్, ఒంగోలు, ముర్ర తదితర జాతులున్నాయి. ఈ వ్యాక్సిన్ వేయడంతో ఈ రకాలు పెద్దఎత్తున ఉత్పత్తి కానుండడంతో పాటు పాల ఉత్పత్తులు సైతం పెరుగనున్నాయి.
4 నుంచి 9 నెలల లోపు వయసున్న ఆడ బర్రె, ఆవు దూడలను గుర్తించి బ్రూసెల్లా వ్యాక్సిన్ వేస్తున్నాం. మండలంలో 684 బర్రె, దూడలను గుర్తించి టీకాలు వేశాం. ఈ వ్యాక్సిన్‌తో పశు వృద్ధితో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ బ్రూసెల్లా వ్యాధి పశువులకే కాదు మనుషులకు సైతం సోకుతుంది. రైతులు అప్రమత్తంగా ఉండి బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ఈ వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తితో రైతులు నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు పశు సంపద పెంపొందించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– టీ సుకన్య, మండల పశు వైద్యాధికారి, రేవోజిపేట, దస్తురాబాద్