ఖానాపూర్, డిసెంబర్ 13: ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకోని ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో ఉన్న సమస్యలపై అడగకుండా ముందస్తూ నిర్బంధం చేయడం ఎందుకని ప్రశ్నించారు. మంత్రి సీతక్క జిల్లాలో పర్యటిస్తూ కొబ్బరికాయలు కొట్టి శిలాఫలాకాలు ప్రారంభించి పోతున్నారే తప్ప, అభివృద్ధి పనులు జరగడం లేదని, సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ప్రజా పాలన అంటూనే చీటికి మాటికి అరెస్ట్లు, నిర్బంధాలతో ప్రశ్నించే వారి గొంతునొక్కుతున్నదని విమర్శించారు. ప్రజాపాలన అంటే నిత్యం ప్రజల గొంతు నొక్కే కుట్రలు చేయడమేనా అంటూ ప్రశ్నించారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇందులో బీఆర్ఎస్వీ నాయకులు శనిగారపు శ్రావణ్, తోట సుమీత్, సుద్దాల మహిపాల్, చుక్కల నరేశ్, మునుగురి ప్రణీత్, బీఆర్ఎస్వీ మండల నాయకులు ఉన్నారు.