మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ) : కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా, సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. కాగజ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ సభలకు నీరా‘జనం’ పట్టారు. కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్లో నిర్వహించిన సభకు 40 వేలు, ఆసిఫాబాద్‌లోని ప్రేమలా గార్డెన్ పక్కన నిర్వహించిన సభకు 40 వేల మంది హాజరయ్యారు.
ఆయా చోట్ల ప్రాంగణాలు సరిపోక రోడ్ల మీద నిలబడాల్సి వచ్చింది. బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియం మొత్తం జనంతో కిక్కిరిసిపోయి కనిపించింది. 50 వేలపై చిలుకు మంది హాజరుకాగా, కాంపౌండ్ వాల్ అవతల నిల్చొని, చుట్టు పక్కల ఉన్న బిల్డింగ్లు ఎక్కి మరీ సభను తిలకించారు. కాగజ్‌నగర్‌లో సీఎం, బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడుతున్నంత సేపు నినాదాలతో హోరెత్తించారు. ఆసిఫాబాద్‌లో సభా వేదికపై అభ్యర్థి కోవ లక్ష్మి మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు, ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన మర్సుకోల సరస్వతికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పడంతో సభ హోరెత్తింది.
బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించినప్పుడల్లా జనం చప్పట్లు కొట్టారు. ప్రజల ఆశీర్వాదం శ్రీరామ రక్ష అని, తెలంగాణ ప్రజలే బాస్‌లని.., నువ్వు భయపడకు… పని చేసిన ప్రభుత్వానికి ప్రజలు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కేసీఆర్ అనడంతో.. మా ఓటు బీఆర్ఎస్కే అనే నినాదాలు వినిపించాయి. సీఎం కేసీఆర్ మార్క్ పంచ్‌లకు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ‘తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాడు గుల్లే.. వీడు సల్లే’.. ‘మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే, మళ్లొచ్చే సరికి ఇళ్లు కాలినట్లు’.. అనగానే సభల్లోని జనమంతా కేరింతలు, చప్పట్లు కొట్టారు.
సభా వేదికలపై సీఎం వచ్చి అభివాదం చేస్తుంటే.. జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. రైతుబంధు ఉండాల్నా.. 24 గంటల కరంట్ కావాల్నా.. ధరణి ఉండాల్నా.. అని సీఎం కేసీఆర్ ప్రశ్నించినప్పుడు.. ఉండాలంటూ సభలకు వచ్చిన జనం నుంచి సమాధానాలు వచ్చాయి. ఆయా చోట్ల కళాకారులు మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, సింగర్ మధుప్రియ ఆటాపాటలతో హోరెత్తించారు. ప్రజలు కండువాలు ఊపుతూ, డ్యాన్సులు చేశారు.