పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రామగుండంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన రోడ్ షోకు జనం నీరా‘జనం’ పలికింది. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, సింగరేణి కార్మికులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా, ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. గులాబీ బాస్ మాట్లాడుతున్నంత సేపు ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ఎండగట్టారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ అని, ఆ పార్టీ పట్ల కార్మికులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడుకోగలుగుతామని, సింగరేణి మనది మనకు ఉంటదని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొనగా, జనం కేరింతలు కొడుతూ జేజేలు పలికారు.