జైనథ్, నవంబర్ 7 : ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను వారు చేసిన అభివృద్ధి పనులపై నిలదీయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలం సాంగిడి, బెదోడ, కాంగార్పూర్, గూడ, మణియార్‌పూర్ గ్రామాల్లో మంగళవారం ఆయన ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు జోగు రామన్నకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మహిళలకు జనధన్ బ్యాంకు ఖాతాల్లో వేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం, నిరుద్యోగులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారన్నారు. రెండు పార్టీల నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. పది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని సూచించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పథకాలు త్వరలో అందజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను మూడోసారి ఎన్నుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, నాయకులు గంభీర్‌ఠాక్రే, పవార్, ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్ తేజ్రావ్ వడ్కర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
ఎదులాపురం, నవంబర్ 7 : 65 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదని, ప్రస్తుతం ఆ పార్టీ నేతలు మరోక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఖుర్షిద్‌నగర్, తాటిగూడ, రాంనగర్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 400 మంది నాయకులు, కార్యకర్తలు, రణదివ్యనగర్కు చెందిన పల్వర్ యూత్ సభ్యులు చిట్టు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, నాయకులు భూమన్న, భాస్కర్, సాంబజీ, దయాకర్, అశోక్, సతీశ్, రవికిరణ్, పర్విన్ ఫేరోజ్, బుట్టి శివకుమార్, గంగారెడ్డి, సలీం, తదితరులు పాల్గొన్నారు.