మంచిర్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తున్నది. హింసా రాజకీయాలను ప్రేరేపిస్తూ.. రౌడీ, గూండా రాజకీయాలు చేస్తూ, మితిమీరిన దౌర్జన్యకాండకు తెగబడుతున్నది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నరు. క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు ఆ పార్టీ చేసిన అరాచకాలను చూసి జనాలకు వెగటు పుట్టింది. ఇప్పటికైనా మారకపోతే ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి భవిష్యత్‌లో ఒక్క సీటు కూడా రాదు. గెలుపోటములను జీర్ణించుకోలేక, ప్రజా తీర్పును ఎదుర్కొనే దమ్మూ.. ధైర్యం లేక క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే బొజ్జు ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదు. ఈ రకమైన కక్షసాధింపు చర్యలతో సాధించేది ఏదీ లేదు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్, రైతు భరోసా.. ఇలా మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి. లేదంటే కాంగ్రెస్‌కు పుట్టగతలు కూడా ఉండవు. రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుందని అనుకోవడం లేదు’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక సందర్భంగా క్యాతన్‌పల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. మా పదేండ్ల పాలనలో ఇలాంటి రాజకీయాలు చేసి ఉంటే మీరు ఇవాళ కనబడుదురా ఆలోచించాలన్నారు.
ఒకవేళ అలాంటి వాళ్లమైతే పోయిన రెండేళ్లలో ఎందుకు గొడవలు కాలేదన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నిక జరుగకుండా స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అడ్డుకోవడం, చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల అధికారులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రకంగా అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఇష్టారీతిన దుర్మార్గంగా ప్రజలిచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్నారు. నేను ఖానాపూర్ వెళ్లకుండా క్యాతన్‌పల్లిలో హౌస్ అరెస్టు చేశారని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మా నాయకులను గృహ నిర్బంధించారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేసే విధంగా.. ఇటు క్యాతన్‌పల్లి, జనగామ, తొర్రూర్, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు.
ఖానాపూర్‌లో ఎమ్మెల్యే బొజ్జు చేసిన దుర్మార్గానికి పోలీసులు సహకరిస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను గృహనిర్బంధించడం దారుణమన్నారు. నిన్న చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు అధికారుల మీదకు అహంకారంతో ఒంటికాలుపై లేచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఎన్నికను వాయిదా వేయించిన బొజ్జును, గతంలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మా మీద లాఠీచార్జి చేయించి, కాంగ్రెసోళ్లతో దాడి చేయించి మమ్ములను అక్రమంగా జైళ్లలో నిర్బంధించారని మండిపడ్డారు. మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరుకు దూరంగా ఉండటానికి కారకులైన వివేక్‌ను గృహ నిర్బంధం చేయాలే తప్ప.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న మాలాంటి వాళ్లను కాదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో, విర్రవీగి చేస్తున్న దౌర్జన్యకాండ తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలన్నారు.
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే.. ఒక్కపని చేసింది లేదని బాల్కసుమన్ మండిపడ్డారు. ప్రజాపాలన కాకుండా, ప్రతీకార పాలన సాగిస్తుందన్నారు. ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కడుతామన్నారు, ఇప్పటికీ దానికి దిక్కులేదన్నారు. గతంలో చెన్నూర్ ఎత్తిపోతల పథకం తీసుకువస్తే దానికి దిక్కులేదన్నారు. జిల్లా మొత్తానికి ఇవ్వాల్సిన సాగునీళ్ల విషయంలో ఒక ఎజెండా లేదు. తాగునీళ్లకు సంబంధించి ఎండాకాలం మొదలైనా, జిల్లా ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నా పట్టింపు లేదన్నారు. యూరియా లేదని, పంటలు కొనే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడని మండిపడ్డారు.
సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలపై శ్రద్ధపెట్టకుండా.. పంచాయతీలు గెలుచుకోవాలే, మున్సిపాలిటీలు గుంజుకోవాలన్న రాజకీయ ఎజెండానేతో కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ప్రజాతీర్పు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఇచ్చినా ఎదురు తిరగాలే, ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా గట్టిగ మాట్లాడితే వాళ్లపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవాలనే ఆలోచన తప్ప.. ప్రజల గురించి కాంగ్రెస్ ఆలోచించడం లేదన్నారు. బీఆర్ఎస్ సర్పంచులకు ఈజేఎస్ పనులు పెట్టకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలతో ఒత్తిడి తీసుకురావడంలాంటి అనైతికమైన చర్యలు దారుణమని మండిపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలను ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని కోరారు. అక్రమ కేసులు, గృహ నిర్బంధాలు, జైలు నిర్బంధాలు, గొడవలు, ప్ర జాతీర్పునకు వ్యతిరేకంగా పనిచేస్తామంటే.. చివరకు సున్నాకు పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి..
బీఆర్ఎస్ సర్కారులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నామన్నారు. సింగరేణి కోల్ట్‌బెల్ట్ ఏరియాలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకువచ్చామన్నారు. జీవో 76తో సింగరేణి స్థలాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని, మెడికల్ బోర్డుతో కొత్త ఉద్యోగాలు ఇప్పించామన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇరిగేషన్ రంగంలో చనాకా-కొరాట, సదర్మాట్, గూడెం ఎత్తిపోతలు పూర్తి చేశామని, చెన్నూర్ ఎత్తిపోతల, ప్రాణహిత వార్ధానదిపై బ్యారేజ్కట్టి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనేక ప్రణాళికలు ఆనాడు సాగు నీటి రంగంలో చేశామన్నారు.
పండిన ప్రతి గింజనూ కొన్నామని, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చామన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఏ పంట కొనడం లేదన్నారు. ఆరుగ్యారంటీల్లో ఒక్కటీ అమలు అవడం లేదన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాలకు నీధులు లేవు, ఒక్క అభివృద్ధి పని జరగడం లేదన్నారు. కేవలం కక్షసాధింపు చర్యల మీద దృష్టి పెట్టి, ప్రతిపక్షాల గొంతునొక్కే పనులు తప్ప.. ఈ జిల్లా ప్రజానికానికి ఉపయోగపడే ఒక్క పని కూడా కాంగ్రెస్ సర్కారు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలను వీడనాడి బీఆర్ఎస్ సర్పంచులున్న దగ్గర, బీఆర్ఎస్ గెలుసుకున్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా పారదర్శకత పాలన అందించడంపై దృష్టి సారించాలని సూచించారు.
మంత్రి వివేక్ రాజీనామా చేయాలి..
గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని, తుడిచి వేస్తామని ఒక మాటచెప్పారని, ఇవాళ ముఖ్యమంత్రి ఆలోచన ధోరణికి అనుకూలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని బాల్కసుమన్ అన్నారు. కేసీఆర్ హయాంలో వెయ్యికిపైగా గురుకులాలు పెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు సంవత్సరానికి రెండు లక్షలకుపైగా ఖర్చుపెట్టి, బ్రహ్మాండమైన మౌలిక వసతులు కల్పించి, అద్భుతమైన కార్పొరేట్ స్థాయి చదువులు చెప్పించారన్నారు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసి ఇప్పటికే 42, 43 మంది గురుకుల విద్యార్థుల మృతికి కారకులయ్యారన్నారు. ఈ రోజు తెలంగాణలో గురుకులాలను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని, ముఖ్యంగా చెన్నూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో శ్రీహిందూ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే.. నేను వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం ఇచ్చి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నా.. ఇప్పటి దాకా ఉలుకూ పలుకూ లేదన్నారు. తాజాగా.. అదే గురుకుల పాఠశాలలో మరో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. అసలేం జరుగుతుందో ఈ మంత్రికి ఏమైనా సోయి ఉందా అని ప్రశ్నించారు.
గురుకల విద్యార్థినులను పట్టించుకోని ఆయన ఒక్క నిమిషం కూడా మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదన్నారు. ప్లిలులు చనిపోతున్నా కనీసం ఒక్క రివ్యూ లేదని, ఆ కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పింది లేదన్నారు. చెన్నూర్ ప్రజలు మీరు ఓట్లు వేసింది.. మీరు మంత్రి కావడానికేనా.. మీ కొడుకు ఎంపీ కావడానికేనా అని మండిపడ్డారు. ఎంత సేపు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని, బాల్కసుమన్‌పై ఏం కేసు పెడుతాం. ఎట్లా జైలుకు పంపిద్దాం. ఎట్లా బద్నాం చేద్దామన్న ఆలోచన తప్ప గురుకులం ఎందుకు గుర్తుకురావడం లేదో చెప్పాలన్నారు. చెన్నూర్ పట్టణంలో బస చేసినప్పుడు ఒక్క అడుగు గురుకులానికి వెళ్లి, చనిపోయిన అమ్మాయి కుటుంబాన్ని పరామర్శిస్తే ఏమైందన్నారు. సర్కారు నుంచి కాకున్నా వేలకోట్ల ఆస్తులున్న నువ్వన్నా వాళ్లకు ఎక్స్‌గ్రేషియా అందించి, విశాఖ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం ఇస్తే ఏమైతుండే అని నిలదీశారు. మంత్రి వివేక్ ఇక్కడే ఉన్నా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి కుటుంబాన్ని పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ బీఆర్ఎస్ నాయకులు మూలరాజిరెడ్డి, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి, రాజారమేశ్, పల్లెభూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
12న జిల్లాకు కేటీఆర్
ఈ నెల 12న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. అక్కడి నుంచి స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో జరగనున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదివారం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. కేటీఆర్ పర్యటన ఇంకా ఫైనల్ కాలేదని, త్వరలోనే అధికారక ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.