బెల్లంపల్లి, డిసెంబర్ 1 : గురుకులాల యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ తొత్తులుగా మారాయని, ఇది సరికాదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ పేర్కొన్నారు. గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనాథ్, పట్టణ అధ్యక్షుడు అరుణ్, నాయకులు అఖిల్, అశోక్,సాయి, కిరణ్, శివ, పవన్, గణేశ్‌తో కలిసి సందర్శించారు. మెయిన్‌గేట్ వద్దనే ప్రిన్సిపాల్ ఊట్ల సంతోష్‌కుమార్ అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేవని, లోనికి రావడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. గేట్ ముందు నాయకులు కూర్చొని నిరసన తెలిపారు.
రేవంత్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపై ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించగా, తాళ్ల గురిజాల ఎస్ రమేశ్ అక్కడికి చేరుకొని.. సందర్శనకు ఎలాంటి అనుమతులు లేవని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. పాఠశాలను సందర్శించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు భీష్మించుకుకూర్చున్నారు. ఇక్కడి నుంచి వెళ్లకుంటే కేసులు బుక్ చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ వచ్చి కండువాలు తీసి సందర్శించవచ్చని సూచించడంతో నాయకులు శాంతించి లోనికి వెళ్లారు.
ఆపై అన్నం ఉడికిందా లేదా, నాణ్యమైన బియ్యాన్ని వండారా లేదా అని పరిశీలించారు. నీళ్లలాగా ఉన్న కోడిగుడ్డు కూరను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టోర్ గదుల్లోకి వెళ్లి కూరగాయాలు, వస్తు సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటామని ముందుకు వెళ్తుండగా ప్రిన్సిపాల్ మరోసారి అడ్డుకున్నారు. విద్యార్థులతో మాట్లాడేది లేదని సూటి గా చెప్పారు. కాసేపు వాగ్వాదం అనంతరం నాయకులు బయటికి వచ్చారు.