ఎదులాపురం, ఏప్రిల్ 18 : పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ్మడాన్ని నిరసిస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ప్రధాని మోదీ, తేజస్వీ సూర్య దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు జాతీయ పార్టీలు పార్లమెంట్లో మహిళా బిల్లుని ఆమోదం తెలుపకుండా అవమానించారన్నారు. తక్షణం మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ప్రభుత్వం మహిళల నుంచి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అజయ్, నారాయణ, గండ్రత్ రమేశ్, యూనిస్ అక్బాని, సాజీదొద్దీన్, మెట్టు ప్రహాద్, దాసరి రమేశ్, అన్నెల వసంత్, సలీం, దమ్మా ల్, కొండ గణేశ్, పందిరి భూమన్న, ప్రమోద్, కాస్తల ప్రేమల, పర్వీన్, కరుణ, ఉమా, తన్వీర్, అనిల్ కంబ్లె, సూర్య ప్రకాశ్, దివిటి రాజు పాల్గొన్నారు.