ఆదిలాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 1,693 మంది పేద దళిత కుటుంబాలకు 4,367.30 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇందుకు రూ.190.90 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
కేసీఆర్ సర్కారు అందించిన భూముల్లో రైతులు బంగారు పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. గతంలో కూలీలుగా పనిచేసిన వారు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన భూముల్లో రెండు సీజన్లలో పత్తి, కంది, సోయా, శనగ, జొన్న సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. దళిత అభివృద్ధి శాఖ నుంచి భూమిని పంపిణీ చేసిన ప్రభుత్వం వారికి పంట పెట్టుబడి సాయాన్ని అందజేసింది. రైతులు ఎడ్లు, నాగలి, బండ్లు ఇతర వ్యవసాయ పనుల కోసం అవసరమైన డబ్బులు అందించారు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేసి దళిత రైతులకు పెట్టుబడి సాయం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సాయంతో గతంలో కూలీలుగా పనిచేసిన వారు ఇప్పుడు రైతులుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్లో దళితబస్తీ భూములు
ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబస్తీ పథకంలో భాగంగా 2018లో 11 దళిత కుటుంబాలకు రెండున్నర నుంచి మూడెకరాల భూమిని పంపిణీ చేసింది. ఎనిమిదేండ్లుగా రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మంచి పంటలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. సారవంతమైన భూములు కావడంతో ఎకరంలో 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నది. రైతులు పత్తితోపాటు సోయా పండిస్తుండగా ఎకరాకు రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తున్నది.
రైతులు మంచి పంటలు పండిస్తుండడంతో ఈ భూముల ధరలు బాగా పెరిగాయి. ఎకరాకు కనీసం రూ. 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో దళితబస్తీ పథకం లబ్ధిదారులు భూములు ఉండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఉపాధి కోసం ఉచితంగా పంపిణీ చేసిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కోని అన్యాయం చేయవద్దని రైతులు కోరుతున్నారు.

భూమి పోతే మా బతుకులు ఆగమవుతాయి..
కేసీఆర్ సార్ ఇచ్చిన భూమిలో పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నా. గతంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమితో రైతుగా మారడంతో నలుగురు గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో మా భూమి పోతదని అధికారులు అంటున్నారు. సర్వే పత్రాలు నింపి ఇవ్వాలని గ్రామానికి వచ్చి సూచించారు. మా భూమి ఇచ్చేది లేకపోవడంతో సర్వే పత్రాలు నింపి ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు పత్తి పండిస్తా. ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం వస్తుంది. ఈ పైసలతో కుటుంబాలను పోషించుకుంటున్నా. కేసీఆర్ సార్ ఇచ్చిన భూములుపోతే మా బతుకులు ఆగమవుతాయి. సర్కారు మా భూములను లాక్కునే ప్రయత్నాలు మానుకోవాలి.
జాడ లేని వాన
మొలకెత్తే దశలో ఉన్న విత్తనాలకు నీటి తడులు అవసరమైన సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా వర్షం లేకపోవడంతో ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. పత్తి, సోయ, మక్క, కంది పంటలకు ప్రస్తుతం నీటి తడులు ఆవశ్యకం. ఈ తరుణంలో వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నీటి వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. బోథ్, ధన్నూర్(బీ), కౌఠ (బీ), మర్లపెల్లి, కుచులాపూర్, పొచ్చెర గ్రామాల్లోని రైతులు స్ప్రింక్లర్లతో మొలకలకు నీటిని అందిస్తున్నారు. ఆ సౌకర్యం లేని రైతులు ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు.
– బోథ్, జూలై 11

తినే అన్నంలో ఇసుక పోస్తున్నారు..
నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చా. కేసీఆర్ ప్రభుత్వం మూడెకరాల భూమిని పంపిణీ చేసి మా బతుకుల్లో వెలుగులు నింపింది. ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ కేసీఆర్ ఇచ్చిన భూములను గుంజుకుంటూ తినే అన్నంలో ఇసుకపోసే ప్రయత్నం చేస్తున్నది. నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కూలీ పనులు చేసుకునే పరిస్థితులు లేవు. భూమి పోతే ఎట్ల బతకాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు గటుకనో, అన్నమో, కారమో పెట్టింది. దాంట్లోనే మేము కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా బతుకుతున్నాం. భూమి ఉండడంతో మాకు ఎక్కడికి పోయినా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఉన్న భూమిని పోతే మమ్ముల్ని ఎవరు రానిస్తారు. దయచేసి మేము రోడ్డున పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దేవన్న, రైతు, గూడ, భోరజ్ మండలం