ఆదిలాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ నేడు(శుక్రవారం) పర్యటించనుంది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అంశాలపై చర్చించనుంది. 13 నెలల కాలంలో వివిధ సమస్యలతో 33 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటలు సరిగా పండకపోవడం, బ్యాంకులు, ప్రైవేటు అప్పులు, దళారుల వద్ద తీసుకున్న బాకీలు తీరకపోవడం వంటి ఆర్థిక సమస్యతోపాటు సాగులో నష్టాలు ఇతర సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం తక్కువగా ఉండడంతో వానకాలం పంటలు మాత్రమే వేస్తారు. రైతు భరోసా పథకం రాకపోవడంతో పెట్టుబడుల కోసం అన్నదాతలు అప్పులు చేయాల్సి వస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ కోసం వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అధికంగా రైతులు సాగు చేసే పత్తి పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ (సీసీఐ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521 ఉండగా.. నాణ్యత సాకుతో రూ.100 తగ్గించి రూ.7,421తో కొనుగోలు చేస్తుంది. ఇలా పలు కారణాలతో రైతులు ఇబ్బంది పడి బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుంది.
రైతు ఆత్మహత్యలపై ఆధ్యయనం చేయడానికి జిల్లా పర్యటనకు వస్తున్న కమిటీ క్షేత్రస్థాయి పర్యటన జరపనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని కిసాన్‌చౌక్‌లో రైతు విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇటీవల జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంకులో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న బేల మండలంలోని రేణిగూడలోని రైతు దేవ్‌రావు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబసభ్యులతో మాట్లాడుతారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయిలో మిర్చి పంట సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి సాగులో సమస్యలు, ఇతర విషయాల గురించి తెలుసుకుంటారు. తర్వాత యాపల్‌గూడలో రైతులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చిస్తారు. రైతు కమిటీ సభ్యులకు తమ సమస్యల గురించి తెలియ జేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. తమ పర్యటనలో రైతుల సమస్యలను పూర్తిగా తెలుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కమిటీ సభ్యుడు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.