ఇండియన్ వెల్స్ : ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ అయిన ఇండియన్ వెల్స్ సింగిల్స్ టైటిల్స్‌ను యానిక్ సిన్నర్ (ఇటలీ), అరీనా సబలెంకా (బెలారస్) సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సిన్నర్.. 7-6 (8/6), 7-6 (7/4)తో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించి తన కెరీర్లో తొలి ఇండియన్ వెల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తద్వారా అతడు ఆరు ఏటీపీ మాస్టర్స్ 1000 హార్డ్ కోర్ట్ టైటిల్స్‌ను గెలిచినవారిలో జొకోవిచ్, ఫెదరర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
మహిళల సింగిల్స్‌లో మూడు సీజన్లలోనూ ఫైనల్ చేరినా టైటిల్ దక్కని టాప్ సీడ్ సబలెంకా.. ఆదివారం నాటి పోరులో మాత్రం ఆ గండాన్ని అధిగమించింది. ఫైనల్లో ఆమె.. 3-6, 6-3, 7-6 (8/6) ఎలీనా రిబాకినా (కజకిస్థాన్)ను చిత్తుచేసి ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో తనకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు తొలి ఇండియన్ వెల్స్ టైటిల్‌నూ నెగ్గింది.