బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం మందమర్రి మండలం చిర్రకుంట, శంకరపల్లి, సారంగపల్లి, అందుగులపేట గ్రామాల్లో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ విస్తృతంగా ప్రచారం చేశారు.
మంచిర్యాల, లక్షెట్టిపేట, శ్రీరాంపూర్ ఆర్కే-7లో ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి.. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి పర్యటించారు. సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.
– మంచిర్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంపై మరింత దృష్టిపెట్టింది. సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన పార్టీ.., ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నది.
ఇందులో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల.., కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఊరూరా జనంతో మమేకమయ్యారు. కాగా, పలు చోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరారు.