ఆసిఫాబాద్/నార్నూర్, ఏప్రిల్9 : ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనాలు పక్షం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సభా ప్రాంగణాలు కిక్కిరిసి పోతుండగా.. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలపై గడప గడపకూ వెళ్లి అవగాహన కల్పించాలని కోరుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్కు తేడా సవివరంగా తెలుపాలని సూచిస్తున్నారు. కాగా.. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్.. నార్నూర్‌లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, జోగు రామన్న, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, మాజీ ఎంపీ నగేశ్.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మనకు శ్రీరామ రక్ష అని, ఆ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ నియోజవర్గంలోగల నార్నూర్ మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లు ఆవరణలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, మాజీ ఎంపీ జీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నార్నూర్ ముఖ ద్వారం నుంచి జిన్నింగ్ మిల్లు వరకు కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ తీశారు. 23 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 2 వేల మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తరలివచ్చారు. జై తెలంగాణ..జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ గ్రామ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై గ్రామస్తులతో చర్చించాలని సూచించారు. నార్నూర్ మండలంలో 8వేలకు పైగా గిరిజనేతరులు వ్యవసాయం చేస్తున్నారని, వారందరికీ రైతుబంధు వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు.
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఈ నెలలోగా అర్హులైన గిరిజనులకు అందిస్తారని తెలిపారు. తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు మరచిపోవద్దని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు సంక్షేమం, అభివృద్ధిని మరచిపోయి ప్రజలపై భారం మోపడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, బ్లాక్ మనీని వెలికితీసి జన్‌ధన్ ఖాతాలో ఒకొకరికీ రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని గుర్తు చేశారు. రైతులను రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. బీజేపీ సర్కారు మన ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులపై ఈడీ సంస్థ ద్వారా దాడులు చేయించి భయాందోళనలకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను మర్చిపోవద్దని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం కష్టపడే వారికి ఫలితముంటుంది : ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకూ ఫలితముంటుందని ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. మధ్యవర్తిత్వం లేకుండా గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. పుట్టబోయే బిడ్డ నుంచి వృద్ధుల వర కూ పథకాలు రూపకల్పన చేశామన్నారు. కలిసికట్టుగా ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేద్దామని పిలుపునిచ్చారు.
అభివృద్ధే మా నినాదం : ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
అభివృద్ధే మా నినాదమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి చోటా సమస్యలుంటాయని, వాటిని పరిషరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రగతి గురించి ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలన్నారు.
ఓటు వేసి సమాధానం చెప్పాలి :ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని, బీఆర్ఎస్ నాయకులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని, ప్రజలంతా ఏకమై ఓటుతో వారికి సమాధానం చెప్పాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమంపై వెనుకాడబోమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని, వాటిని వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. గిరిజనేతరులకు రైతుబంధు, జీవో నంబర్-3 పునరుద్ధరణపై మరోసారి సీఎం కేసీఆర్‌ను కలుస్తామని చెప్పారు.
మరోసారి గెలుపు మనదే : మాజీ ఎంపీ గెడం నాగేష్
రాష్ట్రంలో మరోసారి గెలుపు మనదేనని మాజీ ఎంపీ గెడాం నగేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మండలంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి మరోసారి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ఆయన కోరారు. ‘మా ఊరు-మా రాజ్యం’ కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, పీఏఏసీ ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, మాజీ జడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుష్కర్,ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మీరాబాయి, మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్‌రావ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఇన్సూఅక్బానీ, నాయకులు రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ శివాజీ,రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.
అర్హులకు పక్కా గృహాలు
అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని సాయి కాన్ఫరెన్స్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సొంత జాగా ఉన్న వారికి త్వరలోనే ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు ఇస్తుందన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందన్నారు. దళితబంధు కింద నియోజకవర్గానికి 1100 మందికి త్వరలోనే యూనిట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నదన్నారు. గ్రామస్థాయిలో చర్చ పెట్టి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మన రాష్ట్రంలో పథకాల అమలును వివరించాలన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. ఎవరు అతిక్రమించినా పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. దేశం మనవైపు చూసేలా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. గ్రామస్థాయిలో రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్‌కుమార్, పార్టీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రుక్మణ్‌సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, నీలాబాయి, సురేందర్ యాదవ్, సునీతారెడ్డి, కృష్ణారెడ్డి, ఎలుక రాజు, రమణాఔడ్, సదానందం, లింబాజీ, జగన్‌రెడ్డి పాల్గొన్నారు.
భవిష్యత్ బీఆర్ఎస్దే..
నాయకులు, కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, శ్రేణులు అంతా సమష్టిగా శ్రమించి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గౌరి ఫంక్షన్ హాల్లో భైంసా మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా మండలంలోని మహాగాం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి విఠల్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణను తొమ్మిదేండ్లలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అకాల వర్షం బాధితులకు కేసీఆర్ పరిశీలించిన వెంటనే ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించారని, రెండు గంటల్లోనే నిధులు కేటాయించడం రైతుల మీద ఉన్న ప్రేమను చాటుతుందన్నారు. ఏప్రిల్ 14 తర్వాత మలి విడుత దళితబంధు స్కీం ప్రారంభమవుతుందని తెలిపారు. ముథోల్ నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యాయని.. ఇంకా 2 వేలు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ఎంపీపీ కల్పన జాదవ్, వైస్ ఎంపీపీ గంగాధర్, సోలంకి భీంరావు, సూర్యం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, సదాశివ్, లస్మన్న, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.