బోథ్, జనవరి 26 : బోథ్ మండలంలోని కుచులాపుర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన గ్రామసభలో ప్రొటోకాల్ రగడ నెలకున్నది. లబ్ధిదారులకు నాలుగు పథకాల పత్రాలు అందించేందుకు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సభ మొదలు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే మరో గ్రామంలో కార్యక్రమానికి వెళ్లి రావడానికి కొంత ఆలస్యం అయింది. గ్రామసభకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వచ్చే దాక ఎందుకు సమావేశాన్ని ప్రారంభించడం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాకుండానే సమావేశాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రొటోకాల్ ఎందుకు పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సీఐ వెంకటేశ్వర్ రావ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, శిక్షణ ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఎమ్మెల్యే సభ ప్రాంగాణనికి చేరుకుని సంయమనం పాటించాలని, లబ్దిదారులకు పత్రాలు అందిచేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయాలు ఎందుకు అని సముదాయించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వాజిద్ అలీ, తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమేశ్, ఏపీవో జగ్దేరావ్, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ వసంత్‌రావ్, డైరెక్టర్లు రాజు యాదవ్, పంచాయతీ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.