ఎదులాపురం, అక్టోబర్ 10 : ఆదిలాబాద్‌లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ‘జై తెలంగాణ… కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు నాలుగు వరుసలు నిర్మిస్తూ అక్కడి నుంచి భోరజ్ వరకు రెండు వరుసల రోడ్డు ఎందుకు వేస్తున్నారన్నారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను ప్రశ్నించారు. ఆ పనులు కూడా ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. సీసీఐని ప్రైవేట్ పరం చేయబోమని ఎంపీ, ఎమ్మెల్యే పత్రిక ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
తర్నం బ్రిడ్జి కూలిన తర్వాత క్షణాల్లో అక్కడ వాలి ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి తనపై అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్, బీజేపీలు ప్రజలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల స్టే విధించిందని, తర్వాత జరిగే పోరులో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రహ్లాద్, రాజన్న, దమ్మపాల్, రఫీక్, సుధీర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.