చెన్నూర్ టౌన్/బజార్హత్నూర్, జనవరి 13: పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 14వ తేదీ భోగీ, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు పట్నాల నుంచి ప్రజలు పల్లెల బాట పట్టారు.
భోగి పండుగ : సూర్యోదయానికి ముందే వేకువజామున ఇంటిముందు చలిమంటలు వేసి పిల్లలకు నూనె, గట్టి పిండితో నలుగుపెడతారు. సాయంకాలం చిన్నపిల్లలను ఇంట్లో అందంగా వేసిన ముగ్గులపై పీటపెట్టి దానిపై కూర్చోబెడతారు. చెంబులో రేగు పండ్లు, బియ్యం, చెరుకు ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, పోకలు (బియ్యం మమ చేసినవి), చిల్లర డబ్బులు పిల్లల నెత్తిపైనుంచి పోస్తారు. పెద్దలతో దీవెనలిప్పిస్తారు. చక్కిలాలు, పండ్లను వాయినాలుగా ఇస్తారు.
సంక్రాంతి.. : సూర్యుడిని ప్రత్యేకంగా పూజించే పండుగ సంక్రాంతి. రైతుకు కొత్త పంటలు ఇంటికి చేరి ధాన్యలక్ష్మి ‘సంక్రాంతి లక్ష్మి’గా దర్శనమిస్తుంది. కొందరు పితృదేవతలకు తర్పణం ఇస్తారు. ప్రత్యక్షదైవమైన సూర్యునికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి, సూర్యోదయానికి ముందు పొంగలి (పాయసాన్నం) చేస్తారు. ఆడపిల్లలు తెల్లవారకముందే కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. మగ పిల్లలు పతంగులను ఎగురవేస్తారు. ముగ్గుల మధ్య లో ఆవు పేడను గొబ్బెమ్మలుగా చేసి బంతిపూలతో అ లంకరిస్తారు. రేగుపండ్లు, చిక్కుడు కాయలు, బి య్యం, నూలు వాటి చుట్టూ పోస్తారు. హరిదాసులకు, గంగిరెద్దులవారికి ధాన్యాన్ని, డబ్బులను దానం చేస్తారు. ‘అయ్యగారికి దండంపెట్టు.. మంచిజరగాలని దీవించు..’ అంటూ తలూపే గంగిరెద్దుల సందడి కనిపిస్తుంది.
కనుల పండువగా కనుమ : మూడో రోజు కనుమ పండుగ. కనుమనాడు ముత్తయిదువలకు పసుపురాసి, బొట్టుపెట్టి ఒక్కొక్కరికి నోము ఇస్తారు. చక్కెర, నువ్వుల పొడి చేతిలో పెట్టి ‘తీపి తిని తియ్యగా మాట్లాడు.. నూలు తిని నూరేళ్లు బతుకు’ అని దీవిస్తారు. పెద్ద ముత్తయిదువల దీవెనలందుకుంటారు. చలికాలం పూట నువ్వులు, బెల్లం ఉష్ణాన్నందిస్తాయి. వ్యవపాయంలో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు పూజ చేస్తారు. వనభోజనాలు కూడా ఈరోజే నిర్వహిస్తారు.
పండుగ వేళ చిన్నారులు గాలిపటాలను ఎగరవేస్తున్నారు. వెరైటీ వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ పతంగులతో పాటు సీతాకోకచిలుక, డ్రాగన్, తేలు, పాము పక్షి రూపంలో ఉన్న వెరైటీ పతంగులను చిన్నారులు ఇష్టపడుతున్నారు.