ఎదులాపురం, ఫిబ్రవరి 12 : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. నాలుగు లెబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి వెంకట్ నారాయణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్.మంజుల, ఎన్పీఆర్టీ జిల్లా అధ్యక్షులు నగేశ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటమ్మ, ఎస్ నవీన్‌కుమార్,ఎం.సుజాత, సహాయ కార్యదర్శి దర్శనాల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులు కూడా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కు మద్దతుగా నిరసన తెలిపారు. ఎస్ఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తు నిరసన తెలిపారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు, చట్టాలు చేయాలన్నారు. అదే విధంగా నాలుగు లెబర్ కోడ్లను కూడా రద్దు చేయాలన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నిర్మల్‌లో కార్మిక సంఘాల నాయకులు, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పోశెట్టి, గిరిజన సంఘం నాయకులు తొడసం శంబు తదితరులు పాల్గొన్నారు.