భైంసా టౌన్, జూన్ 13: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం పంట పెట్టుబడికి డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలని కుంసర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంట విక్రయించిన రెండు రోజుల్లోనే ఖాతాలలో డబ్బులు జమ అయ్యేవని, ప్రస్తుతం రైతులను పట్టించుకునే వారేలేరని చెబుతూ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు.
చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే కేంద్రాలను ఎత్తివేసిందని విమర్శించారు. ఒక్కసారి అధికారులు, నాయకులు తమ గ్రామానికి వస్తే తామెంత నష్టపోయామో తెలుస్తుందన్నారు. ఇప్పటికీ ధాన్యం కొనేవారు లేక రహదారులపైనే రాశులుగా పడి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు ఓటీపీ కానీ, ఆధార్ కార్డు కానీ, పట్టా కానీ అడగలేదని, అసలు ధాన్యం కొనుగోళ్లలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. వానాకాలం ప్రారంభమవడంతో వ్యవసాయానికి ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు. రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతులను అప్పులపాలు చేసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ అయ్యేలా చూడాలని కోరారు.