లింగాపూర్, మార్చి 31 : చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుట్టభద్రలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయి గ్రామస్తులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుండగా, సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘భగీరథ కోసం ఎదురుచూపు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇందుకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు గ్రామాన్ని సందర్శించారు.
తాగు నీటి సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. ఇంటింటికీ నీరందించే పరిస్థితి లేకపోవడంతో నేరుగా అడుగంటిన బావిలోకి మిషన్ భగీరథ జలాన్ని వదిలారు. గిరిజనులు ఆ బావిలోని నీటిని తోడుకొని గొంతు తడుపుకుంటున్నారు. కాగా, తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.