బజార్హత్నూర్, సెప్టెంబర్ 8 : వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, దుమారంతో వర్షం కురిసినప్పుడు ఆ తీగలు తెగి పంట భూముల్లో పడుతున్నాయి. వాటిని గమనించని రైతులు వాటి బారి పడి మృత్యువాత పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మూగజీవాలు సైతం చనిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండడమే మంచిదంటున్నారు విద్యుత్‌శాఖ అధికారులు. చాకచక్యంగా వ్యవహరిస్తే మన ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలను సైతం రక్షించవచ్చని చెబుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు రైతులు, ప్రజలు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. వానకు నేల తడిగా మారడం, దానికితోడు గాలి, దుమారం తోడై విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి మనం బయటపడవచ్చు.
వర్షాకాలంలో రైతులు బోరు మోటర్లు స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్తగా స్టార్టర్ డబ్బా వద్ద విద్యుత్ తీగలను సరిచూసుకోవాలి. తెగిపడిపోయి వేలాడుతున్న తీగలను ముందే గుర్తించాలి. విద్యుత్ తీగలు, ఫ్యూజులను నెలకు ఒకసారి పరిశీలించుకోవడంతో ప్రమాదాలను నివారించవచ్చు. వర్షాలు బాగా కురుస్తున్నప్పుడు బోరు వేయకపోవడం ఉత్తమం. స్టార్టర్ డబ్బాలను సురక్షిత ప్రాంతంలో అమర్చుకోవాలి. కాళ్లకు చెప్పులు, చేతికి తొడుగులు ధరించాలి. ఒక్కోసారి స్టార్టర్ డబ్బాలో పాములు, ఎలుకలు ఉండే అవకాశం ఉంటుంది. అవి విద్యుత్ తీగలను కొరికేస్తాయి. వెంటనే మోకానిక్కు చూపించి అధికారులకు సమాచారం ఇవ్వాలి. విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేయించి బాగు చేసుకోవాలి. రైతులు ఫైబర్‌తో చేసిన డబ్బాలను మాత్రమే వినియోగిస్తే మంచిది. తడి చేతులతో విద్యుత్ స్తంభాలనుగానీ, విద్యుత్ తీగలను గాని ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు.
విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల రక్షణ లేకుండా ముళ్ల పొదల నడుమ, నీటి నడుమ కంచె లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పశువులు తాకి మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకు కరెంట్ ప్రవహించే ప్రమాదం ఉన్నందున చిన్నపిల్లలను అటువైపు వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. తడి చేతులతో స్విచ్ వేయకూడదు. కరెంట్‌కు సంబంధించిన వస్తువులను ముట్టనివ్వకుండా చూడాలి. వర్షాకాలంలో ఉతికిన బట్టలను ఇంట్లో తీగలను ఏర్పాటు చేసి ఆరబెట్టుకోవాలి. ఇంటి దాబాపై హైటెన్షన్ వైర్లు ఉంటే వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ వైర్లు తెగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదంటే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఉరుములు, మెరుపుల సమయంలో పొలాల వద్ద ఉన్న వారు తమ ఫోన్‌ను ఆఫ్‌చేసి ఉంచుకోవాలి. పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు ఒడ్డున నడిచేటప్పుడు చేతి కర్రను ఉపయోగించుకోవాలి.
రైతులు, ప్రజలు వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్‌కు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి. తడి చేతులతో విద్యుత్‌కు సంబంధించిన వస్తువులను ముట్టుకోరాదు. ముఖ్యంగా రైతులు వర్షాకాలంలో పొలాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ తీగలను పరిశీలిస్తూ ముందుకు నడవాలి. ప్రజలు విద్యుత్‌కు సంబంధించిన ఎలాంటి అనుమానాలు ఉన్నా, వైర్లు తెగిపోయినా అధికారులకు సమాచారం ఇస్తే మరమ్మతు చర్యలు చేపడుతాం.
– రవి, విద్యుత్ ఏఈ, బజార్హత్నూర్