మంచిర్యాల, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మధ్య చేపట్టిన కులగణన వివరాలు వెల్లడించడంపై బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు. ఇది బీసీల వ్యతిరేక ప్రభుత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.55 కోట్ల జనాభా వివరాలు సేకరించగా, ఇందులో 46 శాతం బీసీల జనాభా ఉన్నట్లు పేర్కొంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉన్నట్లు చెప్పారని.. ఇప్పుడేమో 50 లక్షల జనాభా తగ్గడం వెనుక మతలాబేమిటని బీసీలు నిలదీస్తున్నారు. దాదాపు 60 శాతానికి దగ్గరగా బీసీ జనాభా ఉంటే, 46 శాతమే చూపించడం.. అందులోనూ తెలంగాణ వెనుకబడిన వర్గాలైన ముదిరాజ్లు, మున్నూరుకాపులు, గౌడన్నలు, విశ్వకర్మలు, నేతన్నలు, గొల్లకురుమలు కాదని.. ఓ వర్గాన్ని ఎక్కువగా చూపించారంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనను చూడలేక ఈ రెండున్నరేండ్లలో 50 లక్షల మంది బీసీలు ఆత్మహత్యలు చేసుకున్నారా.. ఆ వివరాలైన సర్కారు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి 2023 దాకా దాదాపు 13.15 లక్షల పెండ్లిళ్లు అయ్యాయని.. 2017 నుంచి 2023 దాకా సర్కారు దవాఖానాల్లో 14 లక్షల మంది పిల్లలు పుట్టారని, వీరు కాకుండా ప్రైవేటు దవాఖానాల్లో ఎన్ని లక్షల ప్రసవాలు జరిగి ఉంటాయో గుర్తించాలంటున్నారు. 2011 జనాభా లెక్కల వృద్ధిరేటును అనుసరించే 2024 రాష్ట్ర జనాభా 4.18 కోట్లు ఉండాలని, కానీ కేవలం 3.50 కోట్లు చూపించడం దారుణమన్నారు. దేనికోసమైన సరే రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా అశాస్త్రీయంగా చేసిన ఈ కులగణను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ బీసీలు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కులాల జనగణన లెక్కలు బీసీ కులాల్లో చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయి. దాదాపు అన్ని బీసీ కులాల లెక్కలు పూర్తి తప్పుల తడకగా కనిపిస్తున్నాయి. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఎక్కువగా ఉన్న బీసీ కులస్తులు.. 2025లో ప్రస్తుత ప్రభుత్వం జరిపిన కుల గణన లెక్కల్లో తక్కువ చేసి చూపించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 27 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 13.75 లక్షలుగా చూపుతున్నారు. ఈ పదేళ్లలో మున్నూరు కాపులను 50 శాతానికి పైగా తక్కువ చేసి చూపించారు. ఆయా కులాల జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతుందే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తగ్గినట్లు పేర్కొనడం ముమ్మాటికీ బీసీలను వంచించడమే అవుతుంది. ఇది ఒక్క మున్నూరు కాపులదే కాదు. అన్ని బీసీ కులాల లెక్కలను తప్పుగా ప్రకటించారు. ఇదిలాఉంటే రెడ్డి కులస్తుల సంఖ్యను మాత్రం రెండింతలు చేసి చూపారు. దీని వెనుక సీఎం రేవంత్రెడ్డి కుట్ర దాగి ఉంది. ఈ కుల గణన ఏమాత్రం పారదర్శకంగా జరగలేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఇలాంటి తప్పుడు లెక్కలతో బీసీ కులాల ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తప్పుడు లెక్కలను వెంటనే ఉపసంహరించుకొని బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే బీసీ సంఘాల తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం.
– ఎంబడి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, నిర్మల్
ఇచ్చోడ, ఏప్రిల్ 16 ః కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను 46 శాతానికి కుదించి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నది. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభా.. పెరగాలే తప్ప ఎలా తగ్గుతుందో అర్థం కావడం లేదు. బీసీలు రాజకీయంగా ఎదగొద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నది. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్ చేపట్టిన కులగణన అసలు సజావుగా సాగనే లేదు. సర్వేలో అనేక తప్పులున్నాయి. మళ్లీ కుల గణన చేపట్టాలి. లేని పక్షంలో అన్ని బీసీ సంఘాలు ఏకమై పోరాటం చేస్తాం.
– ఓరగంటి పెంటన్న, మాజీ సర్పంచ్, సిరికొండ
ఇచ్చోడ, ఏప్రిల్ 16 ః మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు బీసీలు 52 శాతానికిపైగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన నిర్వహించి ఇందులో బీసీల జనాభా కేవలం 46 శాతం మాత్రమే చూపిస్తున్నారు. ఇందులో గొల్ల కుర్మలు, ముదిరాజ్లు, మున్నూరు కాపులు, గౌడ్లు, విశ్వకర్మల జనాభా సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు జనాభా పెరగాలే తప్ప తక్కువ కాదు. ఇందులో బీసీలను తక్కువ చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర దాగి ఉందని అర్థమైతుంది. మళ్లీ బీసీ కులగణన చేపట్టాలి.
– చట్ల వినిల్, బీసీ సంఘం నాయకులు, బజార్హత్నూర్