మంచిర్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన కులగణన సర్వే లెక్కలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా వృద్ధి రేటు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కావాలనే సర్కారు బీసీ కులగణన లెక్కలను తక్కువ చేసి చూపించిందనే ఆయా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 2014లో కేసీఆర్ సర్కారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్లు ఉన్న జనాభా 2024 రేవంత్ సర్కారు నిర్వహించిన సర్వేలో 3.70 కోట్లు మాత్రమే పెరిగింది. అంటే పదేళ్లలో రాష్ట్రంలో 2 లక్షల జనాభానే పెరిగింది. 2014 సర్వేలో బీసీ జనాభా 1,85,61,856 ఉంటే, ప్రస్తుత ఇంటింటి సర్వేలో 1,64,09,179 మంది బీసీలే ఉన్నారు. అంటే పదేళ్లలో బీసీ జనాభా 21,52,677 మంది తగ్గారు. ఇది ఎలా నమ్మశక్యం అవుతుదంటూ.. కేసీఆర్ చేసిన సర్వేనే సరైందం టూ.. రేవంత్ సర్కారు చేసిన సర్వే సరికాదంటూ బీసీ సంఘాల నాయకులు, లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఇలా విమర్శలు వెల్లువెత్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇది దేశానికే దిక్సూచి వంటి సర్వే అంటూ గొప్పలు చెప్పుకోవడంపై మండిపడుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం ఇంత మంది జనాభా ఉందని, ఇందులో బీసీలు ఇంత, ఎస్సీలు, ఎస్టీల జనాభా ఇంత ఉందని చెప్తున్న సర్కారు.. జిల్లాలవారీగా వివరాలు వెల్లడించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటే కేసీఆర్ సర్కారు సర్వే చేసినప్పుడు 2014లో 28,24,953 జనాభా ఉన్నారు. మరి ఇప్పుడు గడిచిన పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2 లక్షల జనాభా పెరిగిందని సర్కారు చెప్తున్నది. ఈ లెక్కన గత పదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున 2 వేల జనాభా మాత్రమే పెరిగినట్లు అవుతుంది. ఇది నమ్మ శక్యమైన పెరుగుదలేనా? జిల్లా మొత్తం పదేళ్లలో 2 వేల మందే పుట్టారని చెప్పే లెక్కల్లో నిజమెంతా? ఉమ్మడి జిల్లాలో గడిచిన పదేళ్లలో జననాలు ఏం జరగలేదా? కేవలం 2 వేల మందే పుట్టారా? ఈ లెక్కలను నమ్మేదెలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో బీసీ జనాభా 60 శాతం వరకు ఉంటుం ది. జనాభా లెక్కలు చూసినా, వృద్ధిరేటు చూసుకున్నా ఈ 60 శాతం అనేది తగ్గేందుకు వీలు లేదన్నది బీసీల వాదన. రాజకీయం, ఆర్థికం, సామాజికంగా అన్ని రకాలుగా జనాభా తమాషాను అనుసరించి తాము ఎదగాలంటే 42 శాతం రిజర్వేషన్లు ఉండాలన్నది బీసీల చిరకాల వాంఛ. కానీ.. తాజా గా కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన గణాంకాలు బీసీల ఆశలపై నీళ్లు చల్లాయిజ వారి భవితవ్యంపై నిప్పులు పోశాయి. రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమే ఉందని, ముస్లింలు మరో 10 శాతం ఉన్నారంటూ రేవంత్ సర్కారు కుండబద్దలు కొట్టడంపై బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం ఉన్న బీసీ లెక్కల్లో 21లక్షల మంది ఎం దుకు తగ్గారు? ఇది కావాలని తగ్గించడం కాకపోతే ఇంకేంటని సర్కారును నిలదీస్తున్నారు. బీసీల జనాభా, రిజర్వేషన్ల అంశం తేలకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, బీసీలను మరోసారి మోసం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోసారి సర్వే చేసి బీసీల లెక్కలు తేల్చాలని, అప్పటివరకు రిజర్వేషన్లు ఖరారు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.
2014లో కేసీఆర్ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 8,16,948 కుటుంబాలు ఉండగా.. 28,24,953 జనాభా ఉన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో పారదర్శకత లేదు. నామ మాత్రంగానే సర్వే నిర్వహించి బీసీ జనాభాను కావాలనే తక్కువ చేసి చూపారు. బీసీలకు అన్యాయం చేయాలని చూడడం సరికాదు. గతంలో తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాల సంఖ్య పెరిగినప్పుడు.. బీసీల సంఖ్య ఎలా తగ్గుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మరోసారి కుల గణన చేపట్టి బీసీ జనాభాను ప్రకటించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ స్థానాలు పెంచి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలి.
– బజ్జూరి వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి
కోటపల్లి, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో మొత్తం అసంపూర్తి సమాచారం ఉంది. అగ్ర వర్ణాల కులస్తుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేసినట్లు స్పష్టమవుతుంది. 100 శాతం సర్వే చేయకుండా నామామాత్రంగా సర్వే చేసి పూర్తయ్యిందని చెప్పడం దారుణం. ఈ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. ఎమ్మెల్సీ టికెట్లు రెడ్ల కులస్తులకే కేటాయించి బీసీలను పక్కన పెట్టారంటే కాంగ్రెస్కు బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
– కొడిశెట్టి రాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే సరిగా చేయలేదు. గతంలో ఉన్న బీసీల సంఖ్య కంటే ఇప్పుడున్న బీసీల సంఖ్య సుమారుగా 5 నుంచి 10 శాతం లోపు పెరగాలి. కానీ. ఈ సర్వేలో 5 శాతం బీసీల సంఖ్య తగ్గింది. మళ్లీ ప్రభుత్వం సక్రమంగా సర్వే చేయాలి. ప్రతీ కులానికి సమన్యాయం చేయాలి. ప్రభుత్వం చేసిన సర్వేను అందరూ తప్పుపడుతున్నారు.
– మాదాసు మధూకర్. మున్నూర్ కాపు సంఘం మాజీ అధ్యక్షుడు. చెన్నూర్
సీఎం రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వే షన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో ఆందోళన చేపడుతాం. బీసీ సర్వేలో కూడా బీసీల శా తాన్ని తక్కువగా చూపారు. బీసీలను మో సం చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతున్న ది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. బీసీలను మోసం చేస్తే ఉద్యమం తప్పదు.
– అసం రవీందర్, బీసీ సంఘం నాయకుడు, తలమడుగు