రామకృష్ణాపూర్, ఆగస్టు 2 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఊరూరా ప్రచారం చేసి ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే విధి విధానాల గురించి తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా చేసిందేమీ లేదని, వారి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర ఇన్చార్జి డా. రాజారమేశ్, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, యూత్, విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.