11 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కాపీని కేంద్రానికి పంపించాలని నిర్ణయించగా, ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కౌటాల, బెజ్జూర్ మండల కేంద్రాల్లో మాలీ కులస్తులు పటాకులు కాల్చి.. మిఠాయిలు పంపిణీ చేశారు. తమ వెనుకబాటు తనాన్ని గుర్తించిన సీఎంకు రుణపడి ఉంటామని, బీజేపీ సర్కారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
– మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాలీ, వాల్మీకిబోయ, బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖయీతి లంబాడా, భాట్ మధురాలు, చమర్ మథుర కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2014లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టడుగు వర్గాల్లో ఉన్న ఈ కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి చెల్లప్ప కమిషన్ను ఏర్పాటు చేశారు.
ఈ కమిషన్ 2016లో అన్ని జిల్లాలను తిరిగి బీసీ జాబితాలో ఉన్న ఆయా కుటుంబాల స్థితిగతులను తెలుసుకున్నది. ఆయా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి నివేదికలు అందించింది. మొదటిసా రి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పం పింది. ఈ అంశంపై కేంద్రం మొండిచేయి చూపింది. తాజా గా శుక్రవారం ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఇందుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది.
11 తెగలను చేర్చాలంటూ..
ఉమ్మడి జిల్లాలో మాలీ తెగ వారు 1.50 లక్షల మంది ఉన్న ట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలీ సామాజిక వర్గం ఎస్టీలుగా ఉంటే తెలంగాణలో బీసీలుగా ఉన్నారు. మాలీ తెగతో పాటు మిగిలిన 10 తెగలను ఎస్టీల్లో చేర్చాలని మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇటీవలే ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించగా రాష్ట్రంలో ఎస్టీ జనాభా 9.04 శాతం మాత్రమే ఉంది. ఇప్పు డు ఈ తెగల చేరికతో ఎస్టీ జనాభా 10 శాతానికి చేరనున్నది.
మాలీల సంబురాలు
కౌటాల/బెజ్జూర్, ఫిబ్రవరి 10 : మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు కౌటాల, బెజ్జూర్ మండల కేంద్రాల్లో మాలీ కులస్తులు సంబురాలు జరుపుకున్నారు. ఆయా చోట్ల పటాకలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ముత్తంపేట సర్పంచ్ ఆదె శ్రీనివాస్, బెజ్జూర్ మండలాధ్యక్షుడు ఆదె అశోక్, ఉపాధ్యక్షుడు సెండె బాబురావు, నాయకులు జ్యోతి రావు, హన్మంతు, కులస్తులు పాల్గొన్నారు.
మా బాధలను అర్థం చేసుకున్న దేవుడు..
సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. వెనుక బడిన వర్గాల బాధలను అర్థం చేసు కుంటున్నారు. మాలీ, వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాల ని తీర్మానం ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ఇందుకు ఆయనకు రుణప డి ఉంటాం. కేంద్రం ప్రభుత్వం కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– ఆదె మనోహర్, మాలీకులస్తుడు, జ్యోతినగర్, కెరమెరి
గత ప్రభుత్వాలు పట్టించుకోలె
మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ మాలీ కులస్తులను ఎస్టీజాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.
– సుకుమార్ పెట్టుకులే, రాష్ట్ర అధ్యక్షుడు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం తెలంగాణ
మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోరాటం చేస్తున్నాం. చెల్లప్ప కమిషన్ వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలో వాల్మీకి బోయల ఆర్థిక స్థితిగతులను వివరించాం. ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పాం. కమిషన్ తమకు అనుకూలంగానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాల్మీకి బోయలను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
– ఆకుల సుదర్శన్, వాల్మీకి బోయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు
కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి
మథురలను బీసీ-డీలో చేర్చడం వల్ల మేము ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాం. పశు పోషణే మా జీవనాధారం. మా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాం. తమను బీసీ-డీలో చేర్చడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మా స్థితిగతులను తెలుసుకొని.. ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపబోతుంది. కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలి.
– కైలాసింగ్, ఉమ్మడి జిల్లా మథురల సంఘం అధ్యక్షుడు, సొనాల
మాకు న్యాయం చేయాలి
వాల్మీకిబోయ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం పెద్ద మనసుతో అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఆమోదించేలా చూడాలి.
– రఘురాం, ఓలా, నిర్మల్ జిల్లా