కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపుల్లో 11 వైన్స్లకు బుధవారం వరకు ఒక్క కూడా దరఖాస్తు రాలేదు. గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచడం, మరో వైపు స్థానిక ఎన్నికలు సమీపంలో ఉండడమే కారణం కావచ్చని తెలుస్తున్నది. ఈ నెల 18తో మద్యం టెండర్ల గడువు ముగియనున్నప్పటికీ బుధవారం వరకు 166 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. గతంలో నిర్వహించిన టెండర్లలో 1026 దరఖాస్తులు వచ్చాయి. – కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
గతంలో రూ.2 లక్షలు ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును ఈ సారి రూ.3 లక్షలకు పెంచడంతో టెండర్లలో దరఖాస్తులు తగ్గించేందుకు ప్రధాన కారణం కావచ్చు. రూ.3 లక్షలుంటే ఒక చిన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్గానో లేక ఎంపీటీసీగానో గెలిచే అవకాశం ఉంటుంది. కాని మద్యం టెండర్లలో రూ.3 లక్షలు పెట్టి టెండర్ వేస్తే లాటరీ తగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మద్యం టెండర్లలో పాల్గొని రూ.3 లక్షలు వృథా చేసుకునే బదులు స్థానిక ఎన్నికల్లో పాల్గొంటే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే భావన ఉన్నట్లు తెలుస్తున్నది. మున్సిపాలిటీ ఏరియాల్లో మినహాయిస్తే మద్యం టెండర్లలో పాల్గొనేది ఎక్కువగా మండల స్థాయిలో చిన్నచిన్న నాయకులు, వ్యాపారులే అధికంగా ఉంటారు. స్థానిక ఎన్నికలు కూడా వస్తుండడంతో మద్యం టెండర్లలో పాల్గొనే రూ.3 లక్షలతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చనే ఆలోచనతో చాలా మంది మద్యం టెండర్లకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.
జిల్లాలో 32 మద్యం షాపులు ఉన్నాయి. ఈ షాపులకు ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగుస్తున్నది. 2025-27 సంవత్సరానికి గాను కొత్త లైసెన్స్లు పొందేందుకు గత నెల 25న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో కలిపి 32 మద్యం దుకాణాలకు గతంలో నిర్వహించిన టెండర్లలో 1026 దరఖాస్తులు రాగా ఈ సారి మంగళవారం వరకు 166 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆసిఫాబాద్ డివిజన్లో 120, కాగజ్నగర్ డివిజన్లో 46 వచ్చాయి. 11 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. రెబ్బెన మండలంలో రెండు షాపులకు, జైనూర్, సిర్పూర్-(యూ), కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు షాపులకు, సిర్పూర్-టీ, చింతలమానేపల్లి, కౌటాలలోని 1 షాపులకు, పెంచికల్పేట్, చింతలమానేపల్లి మండలాల్లో షాపులకు బుధవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
కాగజ్నగర్ డివిజన్లో మూడు షాపులకు ఒక్కో టెండర్ మాత్రమే పడింది. ఆసిఫాబాద్ డివిజన్లోని మూడు మద్యం షాపులకు కూడా ఒక్కో టెండర్ మాత్రమే పడింది. గ్రామాల్లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల ప్రభావం కూడా మద్యం టెండర్లపై పడినట్లు తెలుస్తున్నది. టెండర్లో పాల్గొనేందుకు రూ.3 లక్షలు వెచ్చించి టెండర్లు వేస్తే లాటరీలో అదృష్టం వరించే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. అదే స్థానిక ఎన్నికల్లో సర్పంచుగానో, లేక ఎంపీటీసీ గానో పోటీచేసి రూ.3 లక్షలు ఖర్చుచేస్తే ఎన్నికల్లో గెలిచే అవకాశాలుంటాయి. ఒక వేళ ఓడిన ప్రజల సానుభూతిని పొందే ఆస్కారం ఉంటుంది. లాటరీ వస్తుందో రాదో తెలియని మద్యం టెండర్లలో పాల్గొని రూ.3 లక్షలు పోగొట్టుకునే బదులు స్థానిక ఎన్నికల్లో ఆ డబ్బులు ఖర్చుచేయడమే మేలు అని మండల స్థాయిలో నాయకులు, చిన్నచిన్న వ్యాపారులు భావించడంతోనే మద్యం టెండర్లపై ఆసక్తి చూపకపోవడానికి కారణంగా తెలుస్తున్నది.