మంచిర్యాల, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “భయ్యా.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక నా దగ్గర రూ.8 కోట్లు తీసుకున్నావ్. అవి కాకుండా ఎంపీ ఎన్నికల్లో నా వాళ్లని గెలిపించేందుకు అదనంగా డబ్బులు కూడా ఇచ్చాను. నువ్వు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా పని చేసినా.. నేను ఆలోచించే వాడిని. కానీ, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని కూడా కో ఆపరేట్ చేయలేదు. అది వదిలేయ్. నాకు ఇప్పుడు మంత్రి పదవి వచ్చేలా ఉంది. నా పదవికి నవ్వు అడ్డురావొద్దు.. నీకు పదవి కావాలంటే నీ ఫైరవీ ఏదో నువ్వే చేసుకో.. నాకు అడ్డు వస్తే మాత్రం నా రూ.8 కోట్లు తిరిగి ఇవ్వాలి. నీ పర్సనల్ చెక్కులు పెట్టి.. నా దగ్గర రూ.8 కోట్లు తీసుకొని ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని బాండ్ రాసిచ్చావ్. మంత్రి పదవికి నువ్వు అడ్డు వస్తే నువ్వు ఇచ్చిన చెక్కులు బౌన్స్ చేసి నేను లీగల్ నోటీసు పంపిస్తా” అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దానికి మంత్రి పదవి రేసులో ఉన్న సదరు ఎమ్మెల్యే ఆ రూ.8 కోట్లు ఇప్పుడైతే ఇవ్వలేను.
నాకు మంత్రి పదవి వద్దు… నా భార్యకు కార్పొరేషన్ పదవి వద్దు. ఏం లేకున్నా మంచిదే.. ఆ డబ్బులైతే అడగకు. నా నియోజకవర్గానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. నదిపై కట్టలు కట్టడానికనో.. విద్య లేదా వైద్య ప్రాజెక్టుల కోసమనో నిధులు ఇచ్చారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చకొని నేను ఇవ్వాల్సిన దగ్గర ఇచ్చుకుంట. ఈ డబ్బులు మాత్రం అడగొద్దు అంటూ బేరం కుదుర్చుకున్నారట. ఇప్పుడు ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో అధికార పార్టీ తరఫున ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే, అదే పార్టీ నుంచి జిల్లా కేంద్రంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మరో ఎమ్మెల్యేకు రూ.25 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని లీగల్ నోటీసు పంపించారు. ఇప్పుడు ఆ రూ.25 లక్షలు ఇచ్చిన ఎమ్మెల్యే సోదరుడు సైతం అదే ఎమ్మెల్యేకు రూ.8 కోట్లు ఇచ్చారట. అవి తిరిగి ఇవ్వాలని.. లేకపోతే అన్న మాదిరే తాను లీగల్ నోటీస్ ఇస్తానని.. లేదా మంత్రి పదవి విషయంలో మిన్నకుండిపోవాలని చెప్పడంతో సదరు ఎమ్మెల్యే మంత్రి పదవి రేసు నుంచి తప్పుకున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా నడుస్తున్నది.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే.. మరో ఎమ్మెల్యే బంధువు ఎంపీగా గెలవడానికి డబ్బులు తీసుకోవడం, అవి కాకుండా వ్యక్తిగతంగా చెక్‌లు పెట్టి రూ.8 కోట్లు తీసుకోవడంపై అధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం సీరియస్ అయ్యిందట. జిల్లాలో నీ గ్యాంగ్ చేసే అరాచకాలు చాలు. మాకు మొత్తం తెలుసు.. మంత్రి పదవి విషయంలో జోక్యం చేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సదరు ఎమ్మెల్యే ఏం చేయాలో తెలియని గందరగోళంలో పడిపోయారట.
రాష్ట్రంలోని అధినాయకత్వాన్ని కాదని ఏం చేయలేనని, అలాగని రూ.8కోట్లు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని సదరు ఎమ్మెల్యే మిన్నకుండిపోయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డానని, గడిచిన పదేళ్లలో ఎవరు ఉన్నా.. లేకున్నా ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడుకుంటూ వచ్చానని.. అది గుర్తిం చి తనకే పదవి ఇవ్వాలంటూ తనకు సన్నిహితంగా ఉండే మంత్రుల ముందు సదరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్లు తెలిసింది. కానీ, రాష్ట్రంలో అధికార పార్టీని శాసించే కీలక నేత మాత్రం ఎమ్మెల్యేపై కాంప్రమేజ్ కావాలంటూ ఫోర్స్ చేస్తుండడంతో ఏం చేయాలో తెలియక సదరు ఎమ్మెల్యే అయోమయంలో పడిపోతున్నట్లు తెలిసింది.
జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే రూ.8 కోట్ల చెక్కుల విషయంలో లాక్ అయిపోవడం, ఆయనకు కాకుండా డ బ్బులు బాగా ఉన్న మరో నియోజకవర్గ ఎమ్మెల్యేకు మం త్రి పదవి ఖాయమని అధిష్ఠానం నుంచి సంకేతాలు రావడంతో క్షేత్రస్థాయిలోని కేడర్ సైతం అలర్ట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాదని తెలియడంతో మంత్రి పదవి వచ్చే ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ మాజీ కౌన్సిలర్ ఇంటికి దందాలు చేసే నాయకులందరూ క్యూ కట్టారట. సార్‌కు చెప్పండి మేము కో-ఆపరేట్ చేస్తాంటూ సదరు కౌన్సిలర్‌కు కొంత ముట్టజెప్పారట.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ (మంచిర్యాల బైపాస్ రోడ్డులో నాలాపై అక్రమ నిర్మాణం చేస్తున్న ఓ నేత) సైతం భారీ మొత్తం సదరు కౌన్సిలర్‌కు అప్పగించారనే టాక్ నడుస్తున్నది. ఈ కౌన్సిలర్‌ను గతంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే.. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో గోల్మా ల్ చేశారంటూ అరెస్టు చేయించారు. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే (రూ.8కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే) ఫోన్ చేస్తే ఆ విషయం తప్ప మరేదైనా చెప్పండంటూ ఎమ్మెల్యే మాట్లాడారట. దాన్ని మనసులో పెట్టుకున్న రూ.8 కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే తర్వాత చూసుకుందాం.. నేను ఉన్నానంటూ సదరు కౌన్సిలర్‌కు భరోసా ఇచ్చారట.
తాజాగా.. మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలోకి అధికార పార్టీ లీడర్లు సదరు మాజీ కౌన్సిలర్‌కు దగ్గరైన ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే ఇబ్బందులు తప్పవని.. సదరు నేతకు ముందే ముడుపులు ముట్టచెప్పే పనిలో తలమునకలైనట్లు తెలిసింది. ఏదేమైనా మంత్రి పదవి రేస్ నుంచి రూ.8కోట్లకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కాంప్రమైజ్ అవ్వడంపై ఆయన అనుచరులే పెదవి విరుస్తున్నారు. మా సార్‌కు మంత్రి పదవి వస్తుందని విచ్చల విడి చేశామని, ఇప్పుడు తీరా మా సార్‌ను కాదని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకు పదవి ఇస్తున్నా.. మా సార్ ఉలుకూ.. పలుకూ లేకుండా మి న్నకుండిపోతున్నారంటూ వాపోతున్నారు. ఏ సా ర్కు మంత్రి పదవి వచ్చిన మా పనులైతే ఆపొద్దని క్షేత్రస్థాయిలోని లీడర్లు వేడుకుంటున్న ట్లు తెలిసింది. చీప్‌గా రూ.8 కోట్లకు మంత్రి పదవి వదులుకోవడం ఏమిటి.. మమ్ముల్ని అడిగినా మేం ఇచ్చేవాళ్లం కదా అంటూ జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితులు బయట ప్రచారం చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తున్నది.