తాండూర్, ఆగస్టు 19: మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా తుడుందెబ్బ తాండూర్ మండల అధ్యక్షుడు కుర్సెంగ బాబురావు మాట్లాడుతూ సింగరేణి ప్రధాన రహదారి సమీపంలోని చెక్ పోస్ట్ నుంచి నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని 13 గ్రామాలకు వెళ్ళే రహదారిలో భీమన్నవాగు బ్రిడ్జి కృంగి పోవడంతో అక్కడ నూతన బ్రిడ్జి మంజూరు చేయాలని, లచ్చుగూడ వద్ద రోడ్ డ్యాం నిర్మించాలని, నర్సాపూర్ ప్రధాన రహదారి నుంచి బెజ్జాల వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేదాక ఈ దీక్షను కొనసాగించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు సోయం సురేష్, తుమ్రం జంగు, కుర్సెంగ లచ్చు, ఆత్రం మనోహర్, కుర్సెంగ సాయి కుమార్, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. అలాగే నర్సాపూర్ గ్రామం వద్ద భీమన్న వంతెనను బీజేపీ, బీజేవైఎం నాయకులు సందర్శించి హై లెవెల్ వంతెనను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.