ఆదిలాబాద్ రూరల్, జూలై 16 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రూ.15 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ప్రారంభించారు. వార్డు సభ్యుడు జలారపు శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. గంగపుత్ర సంఘం నాయకులు ఠాక్రే సతీశ్, బోడేవార్ మహేందర్, కిరణ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది రైతులు, యువకులు, గ్రామస్తులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం మూడు గంటలు సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మూడు గంటల విద్యుత్ ఇచ్చే పార్టీ కావాలో, 24 గంటల విద్యుత్ ఇచ్చే పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ చీకట్లు అలుముకుంటాయని, అధికారంలోకి రాక ముందే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుద్ధి బయటపడిందని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. మండలంలోని సిర్సన్నలో రూ. కోటితో చేపడుతున్న సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయలో కరెంట్ కోసం ప్రజలు , ప్రజాప్రతినిధులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. అలాగే సైద్పూర్లో కూడా త్వరలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్, డీఈ హరికృష్ణ, ఏడీ దేవగౌడ, సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ దీపక్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్‌పవార్, దేవన్న, ఇంద్రశేఖర్, సురేశ్ రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ర్యాప్ సాంగ్ విడుదల
యువత తమ నైపుణ్యాలు, సృజనాత్మకతను కనబరిచి ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే జోగు రామన్న ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ అతిథి గృహంలో ర్యాప్ సాంగ్‌ను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్‌తో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి సతీశ్, సాంగ్ కంపోసర్ నితిన్ పవార్, తదితరులు పాల్గొన్నారు.