నిర్మల్ టౌన్, జూలై 12 : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వరదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయని, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. తెలిపారు. జిల్లాలో 563 మిల్లీ మీటర్ల వర్షపాతం అధికంగా కురిసినందున రోడ్లు ధ్వంసమయ్యాయని, పంట నష్టం, అక్కడక్కడా పాత ఇండ్లు కూలిపోయాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. విద్యుత్, వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలను అప్రమత్తం చేసినట్లు వివరించారు. అన్ని మండలాల్లో సర్వే నిర్వహించి రైతులను నష్ట పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షాలు, జరిగిన నష్టంపై ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లు కూలిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గంలో భైంసా, లోకేశ్వరం, తానూరు తదితర మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షం కురవడం వల్ల పత్తి, మొక్కజొన్న, పెసర, సోయా పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్‌బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా అధికారులు విజయలక్ష్మి, రాజేందర్, వెంకటపతి, రవీందర్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తుకారాం పాల్గొన్నారు.
రహదారిని పరిశీలించిన మంత్రి..
మామడ, జూలై 12 : భారీ వరదల కారణంగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలంలోని న్యూసాంగ్వీ వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దారి మళ్లించాలని అధికారులను అదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో గోవర్ధన్, ఎస్ఐ అశోక్ తదితరులున్నారు.
సహాయక చర్యల్లో కార్యకర్తలు పాల్గొనాలి
ఆదిలాబాద్ రూరల్, జూలై 12 : వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులకు తోడుగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం సహాయక చర్యల్లో పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల గురించి తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సహాయక చర్యలు అందేలా చూస్తామని తెలిపారు. అత్యవసర సేవల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 18004251939కు ఫోన్ చేయాలని సూచించారు.