ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో వివిధ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం నాయకులు, వివిధ సంఘాలు, మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కొంతమంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా పని చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో కార్మికులకు అండగా ఉంటూ సమ్మెకు పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, సీనియర్ నాయకుడు యూనిస్ అక్బానీ, శివ, టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం నాయకులు స్వామి, చిన్నన్న, అనసూయ పాల్గొన్నారు.
బోథ్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బీ గోవర్ధన్, ఉపాధ్యక్షురాలు గోదావరి, దాస్, టీఆర్ఎస్ నాయకుడు సోలంకి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల చంటి, గంగాధర్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, మార్చి 29 : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది. మంగళవారం ఆదిలాబాద్‌లోని ఆర్అండ్ బీ విశ్రాంత భవనం నుంచి ర్యాలీ చేపట్టిన అనంతరం టీఎన్జీవోస్లో సభ ఏర్పాటు చేశారు. ర్యాలీలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాయకుడు దర్శనాల మల్లేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మారుస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు విలాస్, లంక రాఘవులు, కిరణ్, వెంకటమ్మ, బండి దత్తాత్రి, నర్సింగ్, నగేశ్, ప్రభాకర్ రెడ్డి, కుంటాల రాములు, దేవేందర్, అనసూయ, స్వామి పాల్గొన్నారు.