ఆదిలాబాద్ రూరల్, మార్చి 5 : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని విద్యానగర్‌లో రూ.98 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు సంబంధించిన శిలాఫలాకాన్ని శనివారం ఆవిష్కరించారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే.. నాయకులకు కనిపించడం లేదా అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టణం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్టీలకు అతీతంగా 49 వార్డుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దవాఖాన కోసం రూ.120కోట్లు ఇచ్చి ఊరుకోవడం కాదని, దాని నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని సూచించారు. నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.60కోట్లు మంజూరు చేస్తున్నదన్నారు. పట్టణంలోని యువత కోసం సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దమ్ముంటే బీజేపీ నాయకులు సీసీఐపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, అజయ్, బండారి సతీశ్, ప్రకాశ్, సంద నర్సింగ్, వెంకన్న పాల్గొన్నారు.
మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఉర్దూ సంఘం భవన నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అతర్ ఉల్లాను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మైనార్టీల్లో విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు సలీం పాషా, అమీమ్ పాల్గొన్నారు.