ఎదులాపురం, ఫిబ్రవరి 27 : ఆదిలాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన పర్యటించారు. పారిశుధ్యం, కార్మికుల పని తీరును పరిశీలించారు. ముందుగా బస్‌డిపో ప్రాంతంలో రోడ్ల శుభ్రం, మురుగు కాల్వలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చి వేయాలని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని కమర్షియల్ ఏరియాలో చెత్తను వేయడానికి డస్ట్‌బిన్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని సక్రమంగా వినియోగించుకునే విధంగా దుకాణాదారులకు అవగాహన కల్పించాలన్నారు. చెత్తను రోడ్లపై వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రచారం నిర్వహించాలన్నారు. శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వెళ్లే దారిలో మీడియన్ కట్టడాలు పూర్తి చేయించాలన్నారు. వివిధ వార్డుల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న మట్టి, ఇసుకను తొలగించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్‌కు అదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, కౌన్సిలర్లు, శ్రీనివాస్, సతీశ్, ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు.
అర్జీలను పరిష్కరించాలి
ఎదులాపురం, ఫిబ్రవరి 27 : ప్రజావాణిలో అందించే అర్జీలను రెండు వారాల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీవోల పరిధిలో పెండింగ్‌లో ఉన్న 268 దరఖాస్తులు వచ్చే వారంలోగా 140 పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1411 దరఖాస్తులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భూ సమస్యలపై కుటుంబ తగాదాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నారు. వ్యక్తిగత, కాలనీ సమస్యలు, తదితర అర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటిపై చర్యలు చేపట్టడానికి ఆయా శాఖల అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, జడ్పీసీఈవో గణపతి, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఆర్డీవో కిషన్, అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలి
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అధికారులు, పాఠశాల యజమాన్య కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ కింద 237 పాఠశాలల్లో మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి పనులు చేపట్టామన్నారు. మన ఊరు-మన బడి పనులతో పాటు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రహరీ, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్డు పనులు మార్చి 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మిగిలిన 200 పాఠశాలల్లో పనులు త్వరితగతిన పూర్తి చేసి మార్చి 15 లోగా ప్రారంభించుకోవాలన్నారు. పూర్తి చేసిన పనులు ఆన్లైన్ రికార్డులో నమోదు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, డీఈవో ప్రణీత, డీఆర్డీఏ కిషన్ పాల్గొన్నారు.