బోథ్/ఉట్నూర్/ఉట్నూర్ రూరల్/సిరికొండ/పెంబి, జూన్ 4 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, ధన్నూర్(బీ)లో జొన్నలు అమ్మకానికి తెచ్చిన తడవకుండా ఉండేందుకు నానా పాట్లు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డులో జొన్నల సంచులు తడిశాయి. చుట్టూ నీరు నిలవడంతో నీటిని తొలగించేందుకు ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్లపై నిలిచిన నీటిని తొలగించారు.
లారీలు లేకపోవడంతో తూకం వేసి రోజులు గడుస్తున్న జొన్నలను గోదాంలకు తరలించకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో కూడా వర్ష పడింది. వడ్లపై కవర్లు కప్పి పంటను కాపాడుకున్నారు. ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల కింద నీరు నిలిచి సంచులు తడిశాయి. సిరికొండలో ఇండ్ల పై రేకులు లేచిపోయాయి. నాలుగు ఎడ్లకు గాయాలయ్యాయి. పెంబిలోని కోనుగోలు కేంద్రంలో మొక్కజొన్న, వరి పంట తడిశాయి. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పిడుగుపడి ఒకరు మృతి
కుంటాల, జూన్ 4 : నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పిడుగుపాటుతో సుభాకర్(74) మృతి చెందాడు. సుభాకర్ వృత్తిరీత్యా వ్యవసాయ కూలీగా పని చేస్తాడు. గురువారం మధ్యాహ్నం పశువులను మేపుతున్న సమయంలో భారీ వర్షం మొదలైంది. దీంతో పక్కనే ఉన్న చెట్టు వద్ద ఉన్నారు. ఈ సమయంలో సుధాకర్‌పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సుభాకర్ భార్య గజ్జవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

