నిర్మల్ టౌన్/ఎదులాపురం, ఫిబ్రవరి 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందించాలని, అలాగే పోడు భూముల సాగు పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. రాష్ట్రంలో కంటి వెలుగు ద్వారా అందించిన కళ్లద్దాలు, పరీక్షలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు సాగు పట్టాలందించేందుకు అర్హులను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పోడు భూముల పట్టాలపై నిర్వహించిన సమావేశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీలు సిద్ధం చేసుకోవాలని, పల్లె ప్రకృతివనాలు అందంగా తీర్చిదిద్దాలన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మన ఊరు-మన బడి పురోగతి, తదితర అంశాలపై జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు వరుణ్రెడ్డి, రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, ఎన్ నటరాజ్, డీఎఫ్వో రాజశేఖర్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఏఎస్పీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.